తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (జనవరి సెషన్ 2026)కు సంబంధించి విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్ మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ అవకాశాన్ని కల్పించింది.
టీజీ టెట్ మాక్ టెస్టులు ఇలా రాసుకోవచ్చు…
- తెలంగాణ టెట్ అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని మాక్ టెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కొత్త విండో ఓపెన్ కావాలి. సైన్ ఇన్ కావాలి.
- ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండా సైన్-ఇన్ అవడం ద్వారా ఉచిత మాక్ టెస్టులను ఉపయోగించుకోవచ్చు.
- ఈ పరీక్షలను రాయటం ద్వారా పరీక్షా విధానంతో పాటు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఓ అవగాహనకు రావొచ్చు.

టీజీ టెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి గతంతో పోల్చితే భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు.
ఈనెల 27న హాల్ టికెట్లు విడుదల
టీజీ టెట్ - 2026 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 27 నుంచి అందుబాటులోకి వస్తాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు తెలంగాణ టెట్ పరీక్షలు జరుగుతాయి. టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.
తెలంగాణ టెట్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్ ఎగ్జామ్ లో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.