కర్ణాటక అడవుల్లో జింకల వేట - హైదరాబాద్‌లో నిందితులు అరెస్ట్..!
కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో జింకలను వేటాడిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు మలక్‌పేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లైసెన్స్డ్ తుపాకీ, నైట్ విజన్ టెలిస్కోప్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి వన్యప్రాణులను వేటాడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు మలక్‌పేట వద్ద రట్టు చేశారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక అటవీ ప్రాంతంలో అత్యాధునిక తుపాకీతో జింకలను వేటాడిన ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నట్లు చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ఖారే కిరణ్ ప్రభాకర్ మంగళవారం వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…... కర్ణాటకలోని కలబురగి జిల్లా చించోలి తాలూకా పరిధిలో ఉన్న చిమ్మంచోడ్ అటవీ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు లైసెన్స్డ్ తుపాకీతో జింకలను వేటాడినట్లు హైదరాబాద్ పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. ఈ సమాచారంతో తక్షణమే అప్రమత్తమైన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రత్యేక బృందం సోమవారం ముమ్మర వాహన తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా వస్తున్న ఒక వాహనాన్ని అడ్డుకుని, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ కెమెరాలు….
పోలీసులు ఆ వాహనంలో సమగ్ర తనిఖీలు నిర్వహించగా, వేటకు ఉపయోగించిన అత్యాధునిక ఆయుధాలు బయటపడ్డాయి. రాత్రి వేళల్లో వేటాడేందుకు వీలుగా 'నైట్-విజన్ టెలిస్కోప్' అమర్చిన ఒక .30-06 స్పోర్టింగ్ రైఫిల్‌ను, 8 బుల్లెట్లను (లైవ్ రౌండ్లు), ఉపయోగించిన 12 ఖాళీ కార్ట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితులు తాము చిమ్మంచోడ్ అడవుల్లో జింకల వేటకు పాల్పడినట్లు ప్రాథమికంగా అంగీకరించారని పోలీసులు తెలిపారు. రాత్రి వేళ అటవీ ప్రాంతంలో లైసెన్స్డ్ ఆయుధాన్ని ఉపయోగించి మొత్తం 12 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించాయి. అంతేకాకుండా, స్వాధీనం చేసుకున్న ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లో జింకల వేటకు సంబంధించిన కీలక వీడియో ఆధారాలు ఉన్నాయని, తమ అక్రమ దందా బయటపడకూడదనే ఉద్దేశంతోనే నిందితులు ఆ ఫోన్‌ను ధ్వంసం చేసి ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించారని సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు
"జింకల వేట ఘటనపై అన్ని కోణాల్లో లోతైన విచారణ జరుపుతున్నాం. ధ్వంసమైన మొబైల్ ఫోన్లోని డేటాను పునరుద్ధరించి ఆధారాలను సేకరిస్తున్నాం," అని డీసీపీ కిరణ్ ప్రభాకర్ తెలిపారు. లైసెన్స్ ఉన్న ఆయుధాన్ని చట్టవిరుద్ధంగా వన్యప్రాణుల వేటకు ఉపయోగించడం, బుల్లెట్ల వినియోగం, అడవుల్లో వేటకు పాల్పడిన పరిస్థితులు మరియు ఎలక్ట్రానిక్ ఆధారాలను ధ్వంసం చేయడానికి చేసిన ప్రయత్నాలపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

