...
...
Next Story

గెట్ టు గెదర్ పార్టీలో ఘోరం.. స్విమ్మింగ్ పూల్‌లో టెక్కీ మృతదేహం.. అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేగింది. ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన వీకెండ్ పార్టీలో 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Published on: Jun 15, 2026, 13:54:37 IST
Advertisement

యాదాద్రి భువనగిరి జిల్లాలో కొయ్యలగూడెం శివారులో ఒక ఫామ్‌హౌస్‌లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాముగా పోలీసులు గుర్తించారు. రాము హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం వీకెండ్ కావడంతో తన టీమ్ లీడర్‌తో పాటు మరో 15 మంది సహోద్యోగులతో కలిసి పార్టీ చేసుకునేందుకు యాదాద్రి జిల్లాలోని ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ పార్టీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది.

గాండ్ల రాము
గాండ్ల రాము

అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత రాము ఫామ్‌హౌస్ ఆవరణలోని స్విమ్మింగ్ పూల్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సహోద్యోగులు గమనించారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాము మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో మృతుడి శరీరంపై కొన్ని గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే సదరు ఫామ్‌హౌస్‌లో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాలను నిర్ధారించడం పోలీసులకు సవాల్‌గా మారింది. కేసు దర్యాప్తులో భాగంగా పార్టీకి హాజరైన ఉద్యోగులందరినీ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.

'మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయి.' అని ఎన్. మన్మథరావు, చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

మృతుడి శరీరంపై గాయాలుండటంతో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. మరోవైపు రాముది సాధారణ మరణం కాదని, అది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks