Yadadri District : ఫార్మా కంపెనీలో ప్రమాదం - రియాక్టర్ పేలి ఇద్దరు మృతి, 9 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని హేజెలో లాబ్స్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోచంపల్లి మండలం పరిధిలోని ధోతిగూడెం గ్రామంలో ఉన్న ‘హేజెలో లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఫార్మా కంపెనీలో హఠాత్తుగా సంభవించిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో తొమ్మిది మంది తీవ్ర అగ్నిగాయాల పాలయ్యారు.

పేలిన రియాక్టర్….
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….. శుక్రవారం రాత్రి దాదాపు 10:30 గంటల ప్రాంతంలో ఫార్మా పరిశ్రమలో ఉన్నట్లుండి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలిపోవడమే ఈ భారీ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతకు కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సమర్థవంతంగా స్పందించారు. చౌటుప్పల్ నుంచి ఒక ఫైర్ ఇంజిన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరో రెండు అగ్నిమాపక వాహనాలను వెంటనే ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది బాధితులను రెస్క్యూ సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మరణించిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం (PME) నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఫైర్ ఆఫీసర్ ధృవీకరించారు.
"ఫార్మా కంపెనీలో పేలుడు జరిగిందనే కాల్ రాగానే మా బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రియాక్టర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నాం. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం" అని అగ్నిమాపక అధికారి వివరించారు. ప్రమాద సమయానికి పరిశ్రమలో ఎంతమంది విధులు నిర్వర్తిస్తున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

