Double Murder Case : సూర్యాపేటలో వేపచెట్టు వివాదం - తండ్రితో పాటు మరో వ్యక్తిని నరికి చంపిన కొడుకు! SIపై కూడా దాడి

Suryapet Double Murder Case : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో వేపచెట్టు నరకడంపై చెలరేగిన వివాదం ఇద్దరి ప్రాణాలను తీసింది. పొరుగింటి వ్యక్తితో పాటు సొంత తండ్రినే గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Published on: Aug 30, 2026, 05:02:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Suryapet Double Murder Case : సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇళ్ల సరిహద్దులోని ఒక వేపచెట్టు విషయమై రెండు పొరుగు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా నడుస్తున్న వివాదం శనివారం హత్యాకాండగా మారింది. ఈ ఘోర ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…. అడ్డుకోబోయిన ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

సూర్యాపేట జిల్లాలో డబుల్ మర్డర్ (image Pixel)
సూర్యాపేట జిల్లాలో డబుల్ మర్డర్ (image Pixel)

వేపచెట్టు విషయంలో తగాదా….

పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని ఒక చిన్న పల్లెటూర్లో ఉన్న రెండు పొరుగు కుటుంబాల మధ్య వారి ఇళ్ల సరిహద్దులో ఉన్న వేపచెట్టు విషయంలో గత కొన్నేళ్లుగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం రోజున ఒక పొరుగింటి వ్యక్తి ఆ వేపచెట్టును నరికేశారు. అలా నరికిన చెట్టు కొమ్మలు పక్కనే ఉన్న మరో పొరుగింటి ఆవరణలో పడ్డాయి. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వాగ్వాదం ప్రారంభమైంది. మాటమాట పెరిగి ఆ గొడవ పరస్పర దాడుల వరకు వెళ్లింది.

అగ్రహంతో ఊగిపోయిన పొరుగింటి వ్యక్తి కొడుకు ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని వచ్చి, ఎదురింటి వ్యక్తిపై దారుణంగా దాడి చేశాడు. గొడ్డలిపోట్లకు తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి రక్తం మడుగులో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ దారుణ హత్యను చూసి నిందితుడి సొంత తండ్రి తీవ్రంగా ఖండించాడు. ఎదురింటి వ్యక్తిని ఎందుకు చంపేశావంటూ కొడుకును నిలదీశాడు.

తండ్రి తన మాట వినకుండా చనిపోయిన పొరుగింటి వ్యక్తికే మద్దతు ఇస్తున్నాడని భావించిన అతగాడు… ఏమాత్రం కనికరం లేకుండా సొంత తండ్రిపై కూడా అదే గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. తీవ్ర గాయాలైన తండ్రి కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఎస్ఐపై కూడా దాడి……

విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) గొడవను ఆపేందుకు, దాడులను నివారించేందుకు ప్రయత్నించారు. అయితే ఆవేశంలో ఉన్న నిందితుడు ఎస్‌ఐపై కూడా గొడ్డలితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, హత్యలకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఎస్‌ఐని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More