Cheyutha Pension Application : కొత్త పింఛన్ దరఖాస్తుల అప్డేట్ - మీ వద్ద ఉండాల్సిన ధ్రువపత్రాల లిస్ట్ ఇదే
Telangana Cheyutha Pension Scheme : రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ, నిబంధనలు, అవసరమైన పత్రాల వివరాలు వెల్లడయ్యాయి. చేయూత పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
Telangana Cheyutha Pension Scheme Applications : తెలంగాణ ప్రభుత్వం నూతన సామాజిక భద్రతా పింఛన్ల (చేయూత) దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులైన పేదలకు పింఛన్లు అందించేందుకు వీలుగా కసరత్తు ప్రారంభమైంది.ఇందులో భాగంగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం నుంచే మొదలైన సంగతి తెలిసిందే. చేయూత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొన్న అనంతరం వాటిని నింపి, అవసరమైన ధ్రువపత్రాలతో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లకు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఎక్కడ, ఎలా చేయాలి?
కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పోర్టల్ ( ( https://cheyutha.telangana.gov.in ) నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నింపిన అప్లికేషన్‌ను మీసేవా కేంద్రాలు, ఎంపీడీవో కార్యాలయాలు, మండల సమాఖ్యలు, మున్సిపల్ ఆఫీసులు లేదా వార్డు కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో సమర్పించే సౌకర్యం కల్పించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు అధికారులు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు అందజేసే వెసులుబాటు కూడా కల్పించారు.
దరఖాస్తుల పరిశీలన ఇలా....
అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఐటీ శాఖకు చెందిన '360 డిగ్రీ సమగ్ర వేదిక' డేటాబేస్ ద్వారా ప్రాథమికంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి విచారణ కోసం దరఖాస్తులను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ/ఎంఎంసీ/సీఎంసీ డిప్యూటీ కమిషనర్ లేదా తహసీల్దార్లకు పంపుతారు.
వెరిఫికేషన్ ఆఫీసర్ నేరుగా లబ్ధిదారుని వద్దకు వచ్చి, చేయూత సామాజిక భద్రతా పింఛన్ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు.
అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, డీఆర్‌డీఓ (DRDO) మరియు హైదరాబాద్‌లోని డీఆర్‌ఓ (DRO) ఆఫీసుకు పంపిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ తుది ఆమోదం తెలిపిన వెంటనే పింఛన్లను మంజూరు చేసి, ప్రతి నెలా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు….
- పూర్తి చేసిన నూతన దరఖాస్తు ఫారం (తప్పనిసరి)
- ఆధార్ కార్డు (తప్పనిసరి)
- వయో నిర్ధారణ పత్రం - జనన ధృవీకరణ / పాఠశాల ధృవీకరణ / ఓటర్ కార్డు (తప్పనిసరి)
- రేషన్ కార్డు లేదా రెవెన్యూ శాఖ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం (తప్పనిసరి)
- బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ - దివ్యాంగ మైనర్ పిల్లల విషయంలో జాయింట్ ఖాతా (తప్పనిసరి)
- భర్త మరణ ధృవీకరణ పత్రం మరియు భర్త ఆధార్ కార్డు (వితంతు పింఛన్ దరఖాస్తుదారులకు)
- విడాకులు/విడిపోయిన పత్రం లేదా తహసీల్దార్ విచారణ నివేదిక (ఒంటరి మహిళ పింఛన్ దరఖాస్తుదారులకు)
- చేనేత & జౌళి శాఖ ధృవీకరణ పత్రం (చేనేత కార్మికుల విషయంలో)
- ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం (కల్లు గీత కార్మికుల విషయంలో)
ఎవరెవరు అనర్హులు….?
- ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు, అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు పింఛనుకు అనర్హులు.
- వైద్యులు (డాక్టర్లు), కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు.
- రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, పెట్రోల్ పంపులు, బోర్వెల్ రిగ్గుల యజమానులు, వారి తల్లిదండ్రులు.
- ఇదివరకే ప్రభుత్వం నుంచి ఇతర సామాజిక భద్రతా పింఛన్ లేదా స్వాతంత్య్ర సమరయోధుల (ఫ్రీడమ్ ఫైటర్) పింఛను పొందుతున్న వారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

