కొండపల్లి సీతారామయ్య అడుగుజాడల్లో మల్లా రాజిరెడ్డి.. అడవి బాట పట్టిన తొలి తరం నేత కథ!
దాదాపు మావోయిస్టు పార్టీ చివరిదశకు వచ్చింది. అగ్రనేతలు అందరూ లొంగిపోయినట్టుగా సమాచారం. ఇందులో తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి ఉన్నారు. దేవ్‌జీ గురించి చాలా మందికి తెలుసు. అయితే మల్లా రాజిరెడ్డి ఉద్యమ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందాం..
ఒకప్పుడు అన్నలొస్తున్నారు.. అంటే ఊర్లలో తెలియని భావోద్వేగం జనాల్లో ఉండేది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ.. మారుతూ.. వచ్చాయి. మావోయిస్టు పార్టీ అంతమయ్యే దశలోకి వచ్చేసింది. నిజానికి కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపైకంటే.. మిలటరీపైనే మావోయిస్టు పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసిందనే విమర్శ ఉంది. అయితే ఆత్మరక్షణలో భాగంగా మిలటరీపైనే దృష్టి ఎక్కువగా పెట్టాల్సి వచ్చిందనేది కొందరి వాదన. ఏది ఏమైన్నప్పటికీ 60 ఏళ్ల నక్సలైట్ ఉద్యమం చివరి దశలో ఉంది.

టాప్ కేడర్ చనిపోవడం, తాజాగా లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడపై ఆ భావజాలం ఉన్నవారికి ఆశలు పోయాయి. అయితే తాజాగా లొంగిపోయిన అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణకు చెందినవారు. దేవ్‌జీ గురించి చాలా మందికి తెలుసు. అయితే మల్లా రాజిరెడ్డి గురించి పూర్తి వివరాలు మీ కోసం..
ఉద్యమమే ప్రాణంగా
దాదాపు నాలుగున్నర దశాబ్దాలు అజ్ఞాత జీవితంలో గడిపిన మల్లా రాజిరెడ్డి, ఉద్యమాన్ని తన ప్రాణంగా చేసుకుని పనిచేశారని చాలా మంది చెబుతుంటారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని గడ్డపై జన్మించిన ఆయన చిన్న వయసులోనే సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఉద్యమంలోకి వెళ్లారు. రాజిరెడ్డి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరారు. మల్లా రాజిరెడ్డి అలియాస్ మీసాల రాజిరెడ్డి, సత్తన్న, సాయన్న, సంగ్రామ్, అలోక్, గోపన్న, దేశ్‌పాండే వంటి అనేక మారుపేర్లతో క్రియాశీలకంగా పనిచేశారు.
రాజిరెడ్డి జనవరి 31, 1950న మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్ పంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మల్లా రాధమ్మ, వెంకట రెడ్డి. ఆయనకు తమ్ముడు భీమారెడ్డి ఉన్నారు.
కొండపల్లి సీతారామయ్య ఐడియాలజీతో
1975లో గ్రామంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఆయనను అరెస్టు చేసి వరంగల్ జైలులో ఉంచారు. జైలులో ఉన్న సమయంలోనే పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యతో అనుబంధం ఉన్న విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. విడుదలైన తర్వాత ఆయన కొండపల్లి సిద్ధాంతాన్ని అనుసరించి ఉద్యమంలో చేరారని కుటుంబ సభ్యులు చెప్పారు. సింగరేణిలో ఉద్యోగానికి కాల్ లెటర్ వచ్చినప్పటికీ, దానిని తిరస్కరించి ప్రజా సమస్యలపై పోరాడాలనే ఉద్దేశంతో ఉద్యమంలో చేరారు.
కేంద్ర కమిటీ సభ్యుడిగా
మల్లా రాజిరెడ్డి స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. మంథనిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1975లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరి 1977 వరకు పనిచేశారు. 1977 నుండి 1981 వరకు మంథని ఏరియా స్క్వాడ్ సభ్యుడిగా, తరువాత స్క్వాడ్ కమాండర్‌గా, 1982 నుండి 1996 వరకు జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు.
దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసు
1988లో ధర్మపురి సమీపంలో ఒకసారి, 2007 డిసెంబర్ 14న కేరళలోని ఎర్నాకుళంలోని ఎస్ఆర్ ప్లాజా సమీపంలో మరోసారి రాజిరెడ్డి అరెస్టు అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులో మంథని కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ తర్వాత పలు విచారణల చేసిన తర్వాత మంథని కోర్టు 2009లో రాజిరెడ్డికి బెయిల్ ఇచ్చింది. కానీ బయటకు వచ్చిన ఆయన మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.
గెరిల్లా దళాల ఏర్పాటులో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని దండకారణ్యంలో మావోయిస్టు గెరిల్లా దళాలను ఏర్పాటు చేయడంలో రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు సహచరుడు. కొండపల్లి సీతారామయ్యతో కూడా కలిసి అనేక ఆలోచనలు చేశారని చెబుతుంటారు.
అడవిలో కుటుంబ సభ్యులతో
రాజిరెడ్డి తల్లిదండ్రులు మరణించినప్పుడు అంత్యక్రియల కోసం వస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ పోలీసుల నిఘా కారణంగా ఆయన రాలేకపోయారు. అయితే 2013లో ఆయన తల్లి చనిపోయిన రెండు నెలలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో కుటుంబ సభ్యులను కలిశారని తెలుస్తోంది.
రాజిరెడ్డి రత్నమ్మను వివాహం చేసుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత పోలీసుల వేధింపులు పెరిగాయి. ఆమె కూడా 1982లో పీపుల్స్ వార్‌లో చేరినట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలో నివసిస్తున్న ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆ బిడ్డను అతని సోదరుడికి అప్పగించారు. రత్నమ్మ మరణం తర్వాత రాజిరెడ్డి బేడ సుగుణ అలియాస్ సంగీతను వివాహం చేసుకున్నారు. ఆమె ఎన్ కౌంటర్‌లో మరణించినట్లు తెలుస్తోంది.
అనేక కేసులు
రాజిరెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలం అన్నారం అడవుల్లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య, కరీంనగర్ పరిధిలోని మరో హత్య, పెద్దపల్లి జిల్లాలోని 20 పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు వంటి అనేక సంఘటనలలో ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50కి పైగా కేసులు అతనిపై ఉన్నాయని తెలుస్తోంది.
మల్లా రాజిరెడ్డి తలపై తెలంగాణలో రూ.1 కోటి 25 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో రూ.75 లక్షల రివార్డు ప్రకటించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


