1/70 చట్టం రక్షణకు సుప్రీంకోర్టులో 2,500 మంది ఆదివాసీల న్యాయపోరాటం

1/70 చట్టం రాజ్యాంగబద్ధమైనదని స్పష్టం చేస్తూ, దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ 2,500 మంది షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనులు ఏకమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సంబంధిత పిటిషన్ వివరాలను సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్ ఒక ప్రకటనలో వివరించారు.

Published on: Sep 28, 2026, 14:23:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఏజెన్సీ ప్రాంతాల్లోని తమ పూర్వీకుల భూములను అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ బదలాయింపుల నుంచి కాపాడుకునేందుకు 2,500 మంది షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన రైతులు ఏకమయ్యారు. తమ హక్కుల పరిరక్షణ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజన ప్రాంత భూములు కేవలం ఆస్తులు మాత్రమే కావని, తమ సంస్కృతి, సంప్రదాయాలు, జీవనాధారంలో అంతర్భాగమని పేర్కొంటూ ఆదివాసీలు ఈ సుదీర్ఘ న్యాయపోరాటానికి దిగారు.

1/70 చట్టం రక్షణకు సుప్రీంకోర్టులో 2,500 మంది ఆదివాసీల న్యాయపోరాటం
1/70 చట్టం రక్షణకు సుప్రీంకోర్టులో 2,500 మంది ఆదివాసీల న్యాయపోరాటం

రాజ్యాంగ నిబంధనలే రక్షణ కవచం

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244, 19(5), ఐదవ షెడ్యూల్‌లోని పేరా 5, 5(2) ఆధారంగా గిరిజనులకు లభించిన ప్రత్యేక రక్షణలను కాపాడాలని వర్ష రాంబాబు, ఆధార్ సొసైటీ సభ్యులతో కలిసి 2,500 మంది గిరిజనులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపులను నియంత్రించి, ఆదివాసీలను ఆర్థిక దోపిడీ నుంచి రక్షించడమే ఈ చట్టాల ప్రధాన ఉద్దేశమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

1/70 చట్టం, 1988 నాటి చారిత్రాత్మక తీర్పు

ఈ చట్టపరమైన సవాలు ప్రధానంగా 'ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నియంత్రణ చట్టం' (1/70 యాక్ట్)పై ఆధారపడి ఉంది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన 'పి. రామిరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (1988) 3 SCC 433' కేసులోని తీర్పు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు జరిగే భూ బదలాయింపులపై సంపూర్ణ నిషేధం విధించడం గిరిజనుల సామాజిక-ఆర్థిక మనుగడకు అత్యవసరమని ఆనాడు సుప్రీంకోర్టు సమర్థించింది.

1978లోని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1)(f) కింద ఉన్న ఆస్తి ప్రాథమిక హక్కును రద్దు చేశారని, కేవలం గిరిజనులకు మాత్రమే ఆర్టికల్ 244, 19(5), 5వ షెడ్యూల్ కింద ప్రత్యేక హక్కులు ఉన్నాయని 1988 తీర్పులోనే అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసినట్లు పిటిషనర్లు గుర్తుచేశారు.

గిరిజన భూములకు ప్రత్యేక రక్షణ ఎందుకు?

గిరిజనులు తరతరాలుగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భూమి వారి దృష్టిలో కేవలం ఒక ఆర్థిక వనరు మాత్రమే కాదు; తమ జీవన విధానం, కుటుంబ పోషణ, సంస్కృతి, గుర్తింపుతో ముడిపడి ఉన్న సహజ వనరు. 1874 నుంచి 1950 మధ్య కాలంలో నిరక్షరాస్యత, పేదరికం, చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల గిరిజనులు భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, గిరిజనేతర వలసదారుల చేతిలో తీవ్రంగా మోసపోయారు.

ఈ పరిస్థితుల నుంచి అమాయక గిరిజనులను కాపాడేందుకే ప్రభుత్వం 1/1959 రెగ్యులేషన్, ఆ తర్వాత సవరించిన 1/70 రెగ్యులేషన్‌ ద్వారా రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించింది. ఈ చట్టం గిరిజనుల అభ్యున్నతికి ఉద్దేశించినదే తప్ప 1970కి ముందు ఉన్న గిరిజనేతరులకు వ్యతిరేకం కాదు. 1970కి పూర్వం ఏజెన్సీలో ఉన్న గిరిజనేతరులు తమ వారసత్వ భూములను జిల్లా కలెక్టర్ అనుమతితో బదిలీ చేసుకునే ప్రత్యేక వెసులుబాటు కూడా ఈ చట్టంలో ఉంది.

‘సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించే యత్నం’

1970 తర్వాత గిరిజన ప్రాంతాలకు అక్రమంగా వలస వచ్చిన కొందరు గిరిజనేతరులు, వడ్డీ వ్యాపారులు గిరిజనుల పట్టా భూములు, ప్రభుత్వ అసైన్‌మెంట్ భూములు, మిగులు భూములను ఆక్రమించారని పిటిషనర్లు ఆరోపించారు. ప్రస్తుతం యారంశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ (WP No. 696/2026), సూరిరెడ్డి రమణారెడ్డి దాఖలు చేసిన సివిల్ అప్పీల్ (No. 394/2023) ద్వారా రద్దయిన ఆర్టికల్ 19(1)(f)ను ఆధారంగా చూపిస్తూ 1/70 చట్టంలోని సెక్షన్ 3(1)(a)ను రద్దు చేయాలని కోరడం సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించడమేనని స్పష్టం చేశారు. ఈ అక్రమ పిటిషన్లను వెంటనే కొట్టివేసి గిరిజన భూములకు సంపూర్ణ రక్షణ కల్పించాలని 2,500 మంది ఆదివాసీలు అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More