...
...
Next Story

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కార్పియో ఢీకొట్టి నలుగురు భవానీ భక్తులు మృతి

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడకు వెళ్తున్న భవానీ భక్తులను స్కార్పియో ఢీకొట్టంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు.

Published on: Oct 22, 2026, 09:05:36 IST
Advertisement

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ భక్తులను మృత్యువు కబళించింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ మాలధారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం
కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన దాదాపు 40 మంది భవానీ భక్తులు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని విజయవాడ వైపు ప్రయాణమయ్యారు. కనకదుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నారు. అయితే వీరి బస్సు కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపానికి చేరుకోగానే వాహనంలో సడన్‌గా సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వాహనాన్ని జాతీయ రహదారి పక్కగా సురక్షితంగా నిలిపివేశారు. బస్సు రిపేర్ అవుతుండటంతో, సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన కొందరు భక్తులు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు బస్సు దిగారు. ఇందులో భాగంగా కొందరు టీ తాగేందుకు రహదారి దాటి ఎదురుగా ఉన్న షాపు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంగా ఒక స్కార్పియో వాహనం రోడ్డు దాటుతున్న భక్తులను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు భక్తులు గాల్లోకి లేచి దూరంగా పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు భక్తులు ఘటన స్థలంలోనే రక్తమడుగులో ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన మరో భక్తుడిని స్థానికులు, పోలీసులు వెంటనే గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించి ఆయన కూడా మృతి చెందారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 'కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన భవానీ భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.' అని లోకేశ్ ఎక్స్‌లోపోస్ట్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks