ఆంధ్రప్రదేశ్‌లో 4 కొత్త కమిషనరేట్లు.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. పరిపాలనా సంస్కరణలు, సాగునీటి ప్రాజెక్టులు, శాంతిభద్రతల పరిరక్షణ, రాజధాని అమరావతి అభివృద్ధియే లక్ష్యంగా ఈ భేటీలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Published on: Sep 23, 2026, 16:30:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించేందుకు, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నాలుగు ప్రధాన నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో కొత్తగా కమిషనరేట్లు ఏర్పాటు కావడం వల్ల నేరాల నియంత్రణ సులువవ్వడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత వేగంగా అందుతాయని మంత్రివర్గం అభిప్రాయపడింది.

ఏపీ మంత్రివర్గ సమావేశం
ఏపీ మంత్రివర్గ సమావేశం

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు క్యాబినెట్ భారీగా నిధులు కేటాయించింది. అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో రూ.1,548 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం లభించింది. రాజధాని మౌలిక సదుపాయాల కోసం అదనంగా రూ.644.98 కోట్లు కేటాయించారు. ప్రతిష్టాత్మక శాసనసభ భవన స్పైర్, రూఫ్, లిఫ్ట్ నిర్మాణ పనుల కోసం రూ.661 కోట్లకు ఆమోదం తెలిపారు. భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు కనీస యాన్యుటీ చెల్లించేలా నిబంధనలలో సవరణలు చేశారు.

రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చే హంద్రీనీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు పురోగతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. HNSS ఫేజ్-II మిగిలిన పనుల కోసం రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

శ్రీనివాసపురం రిజర్వాయర్ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, 2027 నాటికి పనులను పూర్తి చేయాలని గడువు విధించారు. రాయచోటి నియోజకవర్గం HNSS మెయిన్ కెనాల్ 490 - 535 కిలోమీటర్ల మధ్య రూ.350 కోట్ల విలువైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు చంద్రబాబు. శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను హంద్రీనీవాతో అనుసంధానించి, మార్గమధ్యంలోని దాదాపు 25 వేల ఎకరాలకు పైగా ఉన్న ఖాళీ చెరువులను నీటితో నింపేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తొలిదశలో మున్సిపాలిటీలు, రెండో దశలో జెడ్పీటీసీ, మూడో దశలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కూటమిలోని మూడు పార్టీలు అత్యంత ఐక్యతతో పనిచేసి, అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ఇన్‌ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాజకీయాల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో కూర్చొని రౌడీషీటర్లు, క్రిమినల్స్‌తో ప్రతిపక్ష నేత నేరాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు చేటు కలిగించే చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే, ఆ నష్టాన్ని సదరు వ్యక్తుల నుంచే వసూలు చేసేలా కఠినమైన చట్టం తీసుకురావాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి పంటలు వేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా మదనపల్లిలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు అక్టోబర్ 2న శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More