AP Govt : రూ. 200 కోట్లతో 4 కన్వెన్షన్ సెంటర్లు - అమరావతి, తిరుపతి సహా పలు నగరాల్లో నిర్మాణం!
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలు, భారీ బహిరంగ సభలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరంలో రూ.200 కోట్లతో 4 కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనుంది.
రాష్ట్రంలో ఆధునిక మౌలిక వసతుల కల్పనపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. పర్యాటకరంగ అభివృద్ధి, వ్యాపార లావాదేవీలు, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజల సమూహ కార్యక్రమాల నిర్వహణ కోసం ఒకే చోట అన్ని సౌకర్యాలనూ అందుబాటులోకి తేనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రధాన నగరాల్లో సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక, బహుళ ప్రయోజన కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అధికారిక ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నిర్వహణలో ఈ నాలుగు కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగనున్నాయి. ఒక్కో కన్వెన్షన్ సెంటర్‌ను సుమారు రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సమగ్ర పరిశీలన అనంతరం ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ అధికారిక జీవో విడుదల చేశారు.
4 ప్రాంతాల్లో ఏర్పాటు….
ఈ కొత్త ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలైన తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరం, అమరావతిలలో ఈ భారీ కన్వెన్షన్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడలోని ప్రతిష్టాత్మక 'డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళా వేదిక' తరహాలోనే రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన కేంద్రాల్లోనూ ఇటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఆర్థికంగా పొదుపుగా ఉంటూనే, గరిష్ట సౌకర్యాలు కల్పించేలా ఏపీఐఐసీ ఒక ప్రత్యేకమైన లైన్ డిజైన్‌ను రూపొందించింది. ఈ నాలుగు ప్రాంతాల్లో రూపుదిద్దుకోనున్న ఒక్కో కన్వెన్షన్ సెంటర్‌లో ఒకేసారి దాదాపు 2,000 మంది కూర్చుని వేడుకలు లేదా సమావేశాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత విజయవాడ కన్వెన్షన్ సెంటర్ నమూనాలోనే, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ మోడ్) కింద వీటి నిర్వహణ బాధ్యతలను చేపట్టాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు, ఈ నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే 'క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం' (SASCI) పథకం నిధులను మంజూరు చేయాలని ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండి ప్రభుత్వాన్ని కోరారని జీవోలో అధికారులు పొందుపరిచారు. ఈ నిర్ణయంతో ఆయా నగరాల్లో స్థానిక వ్యాపార రంగాలు పుంజుకోవడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

