...
...
Next Story

ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి 50 ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు

వైద్య విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా. చంద్రశేఖర్ అన్నారు. వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్టుగా వెల్లడించారు.

Published on: Sep 8, 2026, 17:49:30 IST
Advertisement

​రాష్ట్రంలో వైద్య విద్యా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, పరిశోధనలను ప్రోత్సహించడం, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. పి.చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆవరణలోని సిల్వర్ జూబ్లీ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా సలహాదారు(ఎన్నారై) డా.లోకేష్ ఈదర, ప్రముఖ అనస్థీషియాలజిస్ట్ డా. కె.వి.రావులతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఏపీలో ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు
ఏపీలో ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు

ఈ సందర్భంగా వీసీ డా. పులాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన సర్వేలు, ఎన్ఐఆర్ఎఫ్ (NIRF), న్యాక్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర కళాశాలలు ఉత్తమ ప్రతిభ కనబరిచాయన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ (AMC) జాతీయ స్థాయిలో 3వ స్థానం, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా.. గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి (SVMC) సహా ఆరు కళాశాలలు అత్యుత్తమ ర్యాంకులు సాధించాయన్నారు.

విద్యార్థుల అధ్యయనం కోసం త్వరలోనే ‘లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (LMS), కృత్రిమ మేధ (AI) ఆధారిత విద్యా విధానాన్ని యూనివర్శిటీలో అమలు చేస్తామన్నారు వీసీ. ముందుగా ప్రభుత్వ కళాశాలల్లో, అనంతరం ప్రైవేట్ కళాశాలల్లో దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. యూనివర్సిటీలో పారదర్శక పరీక్షా విధానంతో పాటు అకడమిక్స్, రీసెర్చ్ కార్యకలాపాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

దేశంలో సగటు ఆయుర్దాయం 72 ఏళ్లకు పెరిగిన నేపథ్యంలో వయోవృద్ధుల సంరక్షణ కోసం ‘జిరియాట్రిక్ మెడిసిన్’, ‘ఫ్యామిలీ మెడిసిన్’ విభాగాల విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు డా. పి.చంద్రశేఖర్. రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలకమైన అత్యవసర విభాగాన్ని బలోపేతం చేయడానికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ విద్యా సంవత్సరం నుంచి 19 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లను ప్రారంభిస్తున్నామన్నారు. ​రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వీసీ తెలిపారు.

మొత్తం 4,581 సీట్లలో 4,321 సీట్లు కేటాయించగా, సీట్లు పొందిన అభ్యర్థుల్లో 4,231 మంది నిర్ణీత గడువులోపు తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేశారు. మరో 90 మంది అభ్యర్థులు రిపోర్ట్ కాలేదన్నారు. ప్రస్తుతం ఫేజ్–II ఆలిండియా కోటా కౌన్సెలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఆలిండియా కోటా కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం సెప్టెంబర్ 11 నాటికి స్టేట్ కోటా ఫేజ్–II కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు తాత్కాలికంగా ప్రతిపాదించామన్నారు.

ప్రతి దశలో కొత్త వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉందన్నారు. సవరించిన కౌన్సెలింగ్ విధానం ప్రకారం ఫేజ్–IIతో పాటు తదుపరి కౌన్సెలింగ్ దశల్లో కూడా అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలకు కొత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ విధానం ద్వారా, గతంలో మాదిరిగా ఒకే దశలో ఇచ్చిన ఆప్షన్లకే పరిమితం కాకుండా, తదుపరి దశల్లో అందుబాటులోకి వచ్చే సీట్లు, కొత్త కళాశాలలు, సీట్ల పెంపుదల వంటి అవకాశాలను కూడా అభ్యర్థులు వినియోగించుకోవచ్చునన్నారు. జాతీయ వైద్య కమిషన్ (NMC) నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కొత్తగా MBBSలో ప్రవేశం పొందిన విద్యార్థులకు సెప్టెంబర్ 15, 2026 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు.

అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలను ఎంపిక మరియు ప్రాధాన్యత క్రమంలో వీలైనంత ఎక్కువ సంఖ్యలో, లేదా అందుబాటులో ఉన్న అన్ని కళాశాలలను ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. దీనివల్ల ఓపెన్ కేటగిరీలో సీటు పొందే అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపిందన్నారు. కేవలం పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఆప్షన్లుగా ఎంచుకుంటే ఓపెన్ కేటగిరీలో సీటు పొందే అవకాశాలు తగ్గే అవకాశం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks