...
...
Next Story

రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే.. కోనసీమకు నరదిష్టి : పవన్ కల్యాణ్

కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదని పవన్ కల్యాణ్ అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

Updated on: Nov 26, 2025, 22:01:31 IST
Advertisement

కోనసీమ జిల్లాలో పల్లె పండుగ 2.0లో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. మోడుబారిన కొబ్బరి చెట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.

సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడకూడదని పవన్ చెప్పారు. కొబ్బరి రైతు రోడ్డు ఎక్కకూడదన్నారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. 45 రోజుల్లో కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని, సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ తో మీ ముందుకు వస్తానని తెలిపారు. కోనసీమ కొబ్బరి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లను పరిశీలించారు.

సమస్య ఎప్పటి నుంచి?

శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఎన్నేళ్లుగా ఉంది? సమస్య ఎప్పటి నుంచి తీవ్రమైంది? శంకరగుప్తం డ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? డ్రెయిన్ ఏమైనా ఆక్రమణలకు గురైందా అన్న వివరాలపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ , ఉద్యాన శాఖ అధికారులను ఆరా తీశారు. అనంతరం పంటలు నష్టపోయిన 13 గ్రామాల ప్రజలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డ్రెయిన్లు, పంట కాలువల ఆధునీకరణకు రూ. 4 వేల కోట్లు అవసరం అని అధికారులు తెలియజేశారు. శంకరగుప్తం డ్రెయిన్ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టేందుకు రూ. 20.62 కోట్లు అవసరం ఉందన్నారు. 50 మీటర్లు ఉన్న డ్రెయిన్ గత ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాంతాల్లో మూడు మీటర్లకు కుచించుకుపోయిందని తెలిపారు. కొన్ని చోట్ల డ్రెయిన్ ఆక్రమణలకు గురయ్యిందన్నారు. కొన్ని చోట్ల అక్రమంగా ప్రవాహానికి అడ్డుకట్టలు వేశారు, దీనివల్ల సముద్రo పోటెత్తినప్పుడు నీరు పంట పొలాల్లోకి చొచ్చుకు వచ్చింది. దీనివల్ల కోనసీమ కొబ్బరి తోటలకు మాత్రమే కాదు తీర ప్రాంతానికి కూడా ముప్పు పొంచి ఉందని నీటిపారుదల విభాగం నిపుణులు బి.సి. రోశయ్య నివేదిక చెబుతోంది.

ఐదేళ్లలో పూడిక తీయలేదు

పచ్చని కోనసీమకు దిష్టి తగిలిందని పవన్ అన్నారు. ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందేమో?నని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కొబ్బరి చెట్లతో చాలా పచ్చదనంగా ఉండేదని తెలంగాణ నాయకులు చెప్పేవారన్నారు. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుంది అంటారని పేర్కొన్నారు.

మోడువారిన కొబ్బరి చెట్లను చూస్తుంటే ఎదిగిన కొడుకు మొండెంతో నిలబడినట్టు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదిగిన కొడుకు ఎంత సంపాదిస్తాడో తెలియదని, ఎదిగిన కొబ్బరి చెట్టు మాత్రం ఆదాయం ఇస్తుందన్నారు. ఎకరం భూమిలో కొబ్బరి తోట ఉంటే రూ. 2 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. 14 ఏళ్లుగా శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఉందని, 14 రోజుల్లో పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని హామీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి.

ప్రత్యేక కమిటీ

కోనసీమ ప్రాంతంలో డ్రెయిన్లపై నీటిపారుదలశాఖ నిపుణులు బి.సి. రోశయ్య రాసిన రిపోర్టును అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామని పవన్ చెప్పారు. రెండు వారాల్లో అధికారులు ఈ రిపోర్టుపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 2వ వారంలో ఈ సమస్యపై అధికారులు, రైతులతో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.

డ్రెయిన్ లో ఆక్రమణలు ఎంత ఉన్నాయి? గట్టు ఎంత మేర దెబ్బ తింది? ఏ మేరకు పూడిక ఉంది? అనే అంశాలతోపాటు బి.సి. రోశయ్య రిపోర్టుపై కూడా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమస్య తీవ్రత తెలియజేసి పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ప్రత్యేక కమిటీ వేద్దామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేద్దాం అని మాట ఇచ్చారు.

కేంద్రం దృష్టికి సమస్యలు

'కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోంది. ఇక్కడ కోకోనట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం మాత్రమే ఉంది. కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. ఓఎన్జీసీ కార్యకలాపాలు కూడా సమస్యకు కారణం అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. స్థానిక పార్లమెంటు సభ్యులతో సహా మనకు 21 మంది ఎంపీలు ఉన్నారు. వారితో కలసి కోనసీమ కొబ్బరి రైతుల సమస్యను కేంద్రం ముందు ఉంచుతాం. సమస్య మూలాలు వెతికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం.' అని పవన్ కల్యాణ్ అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks