Sign in

కూటమి ప్రభుత్వంపై కౌలు రైతులు సంతృప్తిగా ఉన్నారా? లేరా? సర్వేలో కీలక విషయాలు!

కౌలు రైతుల గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోదదని ఎప్పటి నుంచో చర్చ ఉంది. అయితే తాజాగా ఓ సర్వేలో కౌలు రైతుల గురించి అనేక విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కౌలు రైతులు సంతృప్తిగా ఉన్నారా? లేదా?

Published on: Oct 27, 2025, 11:26:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజన తర్వాత కూడా ఏపీలో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతుల సమస్యలను ఏ రాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం క్షేత్రస్తాయిలో 26 జిల్లాల్లో సర్వే నిర్వహించి దాదాపు 3000 శాంపిల్స్ సేకరించింది. ఒక్కొక్క జిల్లానుండి 100 నుండి 125 శాంపిల్స్ సేకరించారు.

క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం సభ్యులు సేకరించిన డేటాను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డేటా ఎంట్రీ చేసి, అనాలసిస్ చేసి నివేదికను రూపొందించింది. కౌలురైతులకు గుర్తింపు కార్డు ఇచ్చిందా అని ప్రశ్నించినప్పుడు 87.7 శాతం మంది ఇవ్వలేదని కేవలం 12.3 శాతం మాత్రమే ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కౌలురైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో కౌలురైతులకు ఇస్తామన్న గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడమే.

కౌలు రైతులు అసంతృప్తి

కౌలు రైతుల గుర్తింపునకు ఇబ్బందిగా మారిన పంట సాగుదారు హక్కు చట్టం(సీసీఆర్సీ) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇది అమలుకాకపోవడం పట్ల కౌలురైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కూటమి ప్రజాగళం పేరిట విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నీ సంక్షేమ పథకాలతో పాటు, పంటల భీమాను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 17 నెలలు కావొస్తున్నా... ఇది కార్యరూపం దాల్చకపోవడంతో కౌలు రైతులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే కౌలు రైతుల కోసం చట్టం తీసుకొస్తామని ప్రకటించినా ఈ చట్టాన్ని తీసుకురాకపోవడం పట్ల కౌలురైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నిస్తే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం, గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు.

అధికంగా వడ్డీ

వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సంవత్సరానికి ఎంత అవసరమౌతోందని కౌలురైతులు ప్రశ్నించినప్పుడు 60 వేలకు పైన 34.3 శాతం, 40 వేల నుండి 60 వేల వరకు 23.8 శాతం, 25 వేల నుండి 45 వరకు 34.8 శాతం, 10 వేల నుండి 25 వేల వరకు 7.2 శాతం మంది కౌలురైతులు తెలిపారు. వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి సహాయానికి ఎవరిపైన ఆధారపడుతున్నారని కౌలురైతులను ప్రశ్నించగా వడ్డీ వ్యాపారుస్థుల నుండి 38.1, రైస్ మిల్లర్లు, దళారులు, వ్యాపారస్థుల నుండి 28.8, కోఆపరేటివ్ బ్యాంకులు నుండి 13.5, భూయజమానుల నుండి 12.7, జాతీయ బ్యాంకుల నుండి 2.5 శాతం ఆర్థిక సహాయం పొందుతున్నామని కౌలురైతులు చెప్పారు.

ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకునే అప్పునకు ఎంత వడ్డీ చెల్లిస్తున్నారని ప్రశ్నించినప్పుడు అత్యధిక శాతం కౌలురైతులు 2 రూపాయలు చెల్లిస్తున్నామని 79 శాతం మంది తెలిపారు. రూపాయిన్నర చెల్లిస్తున్నామని 6.7 శాతం, ఒకరూపాయి చెల్లిస్తున్నామని 1.8 శాతం, 3 రూపాయలు చెల్లిస్తున్నామని 8.2 శాతం మంది వెల్లడించారు.

ఎంత పెట్టుబడి?

ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారని కౌలురైతులను ప్రశ్నించగా 60 వేల పైన 26.5, 40 వేల నుండి 60 వేల వరకు 21.5 శాతం, 20 వేల నుండి 40 వేల వరకు 33.8 శాతం, 10 వేల నుండి 20 వేల వరకు 13.3 శాతం పెట్టుబడి పెడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఒక పంట సాగుచేస్తే సంవత్సరానికి ఎంత ఆదాయం కౌలురైతులకు వస్తుందని ప్రశ్నిస్తే 25 వేల పైన ఆదాయం వస్తోందని 28.1 శాతం, లాభం లేదు, నష్టం లేదని 19.4 శాతం మంది తెలుపగా, నష్టం వస్తోందని 15.4 శాతం మంది తెలిపారు. కూలీలకే దాదాపు 69.8 శాతం ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

అప్పు ఎంత?

ప్రస్తుతం మీకు ఎంత అప్పు ఉందని ప్రశ్నించగా 5 లక్షల పైన 20.4 శాతం, 3 లక్షల నుండి 5 లక్షల వరకు 14.5 శాతం, లక్షన్నర నుండి 3 లక్షల వరకు 34.6 శాతం, 50 వేల నుండి లక్షా 50 వేల వరకు 21.5 శాతం, 50 వేల కన్నా తక్కువ 9 శాతం మందికి అప్పు ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు పెరిగిపోవడమని 67.2 శాతం మంది తెలుపగా అధిక కౌలు వల్ల అని 12.5 శాతం, గిట్టుబాటు ధరలు రాకపోవడం వల్ల అని 10.8 శాతం, అధికవడ్డీలతో అప్పులు పెరిగిపోవడం అని 5.5 శాతం, మార్కెటింగ్ సమస్యల వల్ల అని 4 శాతం మంది చెప్పారు.

అందని ప్రభుత్వ సాయం

కౌలురైతులు ముఖ్యంగా ఎరువుల విషయంలో, పంట నష్టం వచ్చినప్పుడు భూయజమాని కౌలుతగ్గించకపోవడం, అకాలవర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ప్రకటించే అరకొర సహాయం కూడా కౌలురైతులకు అందకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఎకరానికి కౌలు ఎంత చెల్లిస్తున్నారని ప్రశ్నించినప్పుడు కొంతమంది నగదు రూపంలో చెప్పగా, కొంత మంది బస్తాలు (ధాన్యం) రూపంలో అని తెలిపారు.

కౌలు ఒప్పందం

సంవత్సరానికి 35 వేల పైన భూయజమానులకు కౌలు చెల్లిస్తున్నామని 5.1 శాతం , 25 వేల నుండి 35 వేలు అని 8.7 శాతం, 10 వేల నుండి 25 వేలు 27.3 శాతం, 10 వేల కన్నా తక్కువ అని 22.4 శాతం మంది వెల్లడించారు. సంవత్సరానికి ఎకరానికి 20 నుండి 30 బస్తాలు (ధాన్యం) భూయజమానులకు కౌలు కింద పంటలో భాగం ఇస్తున్నామని 13.2, 15 నుండి 20 బస్తాలు (ధాన్యం) 8.7, 10 నుండి 15 బస్తాలు(ధాన్యం) 14.5 శాతం మంది ఇస్తున్నామని చెప్పారు.

కౌలు ఒప్పందం మాట రూపంలోనే చేసుకుంటామని 92.3 తెలుపగా, రాతపూర్వకంగా ఒప్పందం చేసుకుంటామని 3.9, రెవెన్యూ రికార్డులో నమోదు ద్వారా 2.6 శాతం తెలిపారు. 10 ఎకరాలకు పైగా కౌలు తీసుకుంటున్న రైతులు 15.9 శాతం, 4 నుండి 10 ఎకరాలు 34.8 శాతం, 1 నుండి 3 ఎకరాలు 43.6 శాతం, ఒక ఎకరం కంటే తక్కువ 5.7 శాతం మంది భూయజమానుల నుండి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

20 సంవత్సరాలకు పైగా కౌలుకు వ్యవసాయం చేస్తున్న రైతులు 35.5 శాతం ఉండగా, 11 నుండి 20 సంవత్సరాల వరకు 17.4 శాతం, 6 నుండి 10 సంవత్సరాలు 20 శాతం, 1 నుండి 5 సంవత్సరాల వరకు 27 శాతం మంది ఉన్నారు.

ఇతర సమస్యలు

సామాజికంగా మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, భూయజమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయవలసి వస్తుందని, బడుగుబలహీనవర్గాల వారి నుండి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ తమ సామాజికవర్గానికి మాత్రం తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నట్లు కౌలురైతులు తెలిపారు. కౌలు రేట్ల విషయంలో కూడా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో తెలిసింది. అంతేకాదు ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలురైతులకు హక్కులు వస్తాయనే ఆందోళనలో భూయజమానులకు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగుచేస్తున్న కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదని సర్వేలో తేలింది. క్షేత్రస్థాయిలో సర్వే సందర్భంగా కౌలురైతులతో మాట్లాడినప్పుడు నూతనంగా తీసుకొస్తామని చెప్పిన కౌలు చట్టంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే భావనలో అత్యధిక శాతం మంది కౌలురైతులు ఉన్నారు.

రాష్ట్రప్రభుత్వానికి కౌలు చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని రావచ్చనే పలుచోట్ల కౌలురైతులు తెలిపారు. కౌలుదారులకు కొత్త చట్టం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 సదస్సులు నిర్వహించి కౌలు రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సేకరించిన సమాచారాన్ని చెత్త బుట్టలో వేశారా? లేక పరిగణలోనికి తీసుకుంటారా? అనే విషయం పై స్పష్టత లేదని పలు చోట్ల రైతులు తెలిపారు.

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా కౌలు రైతులకు భూయజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావొస్తున్నా కౌలు చట్టం అమలు కాలేదు, గుర్తింపు కార్డులు అందలేదు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు, దీంతో వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది, అప్పుల భారం పెరుగుతోంది.

ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుపానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది, గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది.

వర్షాభావం, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు. చాలా మంది కౌలు రైతులు నోటి మాటతో ఒప్పందాలు చేసుకుని భూమిని తీసుకుంటారు. దీనివల్ల భూయజమానులతో వివాదాలు వచ్చినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ లభించడం లేదు, ఫలితంగా సాగుచేయడానికి భూమిని, భూమిలో పెట్టిన పంటను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేయడం గురించి కౌలు రైతులకు తగిన శిక్షణ లేదా సాంకేతిక సమాచారం అందడం లేదు, దీంతో దిగుబడి తగ్గుతోంది. కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో చేరలేకపోతున్నారు, ఎందుకంటే వారి వద్ద భూమి యాజమాన్య పత్రాలు లేవు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు వారికి ఎలాంటి భరోసా లేదు. రైతు భరోసా పథకం కౌలు రైతులకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు.

భూ యజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని అత్యధిక శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు.

భూ యజమానికి లాభాలు

- భూ యజమానికి పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.20,000 మూడు దఫాలుగా ఇస్తున్నాయి.

- బ్యాంకు నుంచి రెండు ఎకరాలకు "స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ "ప్రకారం సుమారు రూ.80 వేలు రుణం తీసుకుంటాడు. లక్ష రూపాయలు లోపు రుణం తీసుకున్న వారికి సకాలంలో చెల్లిస్తే సున్నా వడ్డీ కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఆ భూ యజమాని బ్యాంకుకు వడ్డీ కట్టవలసిన అవసరం లేదు. పైగా ఆ రూ.80వేలు బయట వ్యక్తులకు వడ్డీకి నూటికి రెండు రూపాయల చొప్పున ఇస్తే సుమారు రూ. 20 వేలు ఆదాయం వస్తుంది.

- కౌలు రూపంలో రెండు ఎకరాలకు గాను సుమారు రూ.78 వేలు పైగా ఆదాయం వస్తుంది. సంవత్సరానికి రూ.ఒక లక్ష 18వేలు ఆదాయం భూ యజమానికి సమకూరుతుంది.

- భూ యజమానులు సంపాదించిన డబ్బులు బ్యాంకులో పెడితే ఆదాయ పన్ను చెల్లించాలి. భూములకు ఎటువంటి పన్నులు లేవు కాబట్టి భూములు కొనుగోలు చేసి ఆదాయాన్ని ఆదా చేసుకుకోవడానికి ఇది భూమి కొనుగోలు ఒక వనరుగా మారింది.

- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలు ధాన్యం, ఇతర పంటలు అమ్ముకున్నప్పుడు మద్దతు ధరతో పాటు కాటా, హమాలీ కూలీ,రవాణా ఖర్చులు కూడా ఇస్తున్నాయి. పంటల ధరలు మాత్రమే లెక్కగట్టి కౌలురైతులకు ఇస్తున్నారు. కాంటా కూలీ,హమాలీ కూలీ,రవాణా ఛార్జీలు మాత్రం భూ యజమానులే ఉంచుకుంటున్నారని కౌలురైతులు చెబుతున్నారు.

- సబ్సిడీ వ్యవసాయంత్ర పరికరాలు ముఖ్యంగా (ట్రాక్టర్ లాంటి) కూడా భూ యజమానులకే ఇస్తున్నారు. వీటిని ఆ గ్రామంలో కౌలు రైతులకు రెంట్‌కు ఇస్తున్నారు. ఇది లెక్కలోకి రాని అదనపు ఆదాయం.

- రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో పంటల అమ్ముకునే సందర్బంలో పంటల ధరలు పోయినప్పుడు అప్పుడప్పుడు బోనాస్, ఇన్సింటీవ్స్ కింద డబ్బులు ఇస్తుంది. అవి కూడా భూ యజమానులకే వెళ్తున్నాయి.

- భూములను కౌలుకు ఇచ్చిన యజమానులు ఆ గ్రామంలో ఎక్కువ మంది ఉండటం లేదు. వీరంతా వివిధ పట్టణాల్లో ,రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. వాళ్ళ భూమికి రక్షణ అవసరం. అటువంటి నేపథ్యంలో భూమిని కౌలుకు ఇచ్చి కౌలురైతును సంరక్షుడిగా పెట్టుకుంటున్నారు. అంటే కాపల దారుడు గానూ, వాచ్మెన్ గానూ ఉంటున్నాడు

- భూమిని కౌలుకు తీసుకున్న కౌలు రైతు ఆ భూమిలో రాళ్లు, రప్పలు ప్రతి సంవత్సరం తీసి వేసి భూమిని నిరంతరం శుభ్రం చేస్తూ తన శ్రమ ద్వారా ఆ భూమి విలువను పెంచుతాడు. భూ యజమాని అవసరమై ఆ భూమిని అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారులు ఆ భూమిని చూసి ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు. ఇది ఒక ప్రయోజనం.

- ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో భూ యజమాని ఇంట్లో శుభ, అశుభ కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో భూమిని కౌలు తీసుకున్న కౌలు రైతులు ఆ ఇంటికెళ్లి కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. అది వివిధ రూపాల్లో ఉంటుంది. కొన్ని పనులకు విలువ కట్టలేం. ఇది ఒక రకమైన సామాజిక (వెట్టిచాకిరి) సర్వీసు. భూమిని కౌలుకి ఇచ్చాడనే దృక్పథంతో కౌలు రైతులు కొన్ని పనులు చేస్తారు. ఇది కూడా భూ యజమానికి ప్రయోజనమే.

- ఇవి గాకుండా ప్రకృతి వైపరీత్యాలు వల్ల పంటల దెబ్బతింటే వచ్చే ఇన్ పుట్ సబ్సిడీ, పంటల భీమా పరిహారం భూ యజమానికే పోతాయి పెట్టుబడి పెట్టిన కౌలురైతుకు కనీసం ఖర్చు కూడా రాకుండా వీధిలో పడతాడు.

- కౌలు దోపిడీ, వడ్డీ దోపిడీ, మార్కెట్ దోపిడీ, ఇన్ పుట్ ధరల దోపిడీ (విత్తనాలు,ఎరువులు పురుగు మందులు ధరలు నిరంతరం పేరుగుదల)వీటికి తోడు ప్రకృతి విపత్తులతో కౌలురైతులు అల్లాడిపోతున్నారు.

- చెమట చుక్క చిందించకుండానే భూ యజమాని అనేక ప్రయోజనాలు పొందుతున్నాడు.

- పంట వేసినప్పుడు దిగుబడి వస్తుందో రాదో, మద్దతు ధర దక్కుతుందో లేదో, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో, రాదో అని తీవ్రమైన ఆందోళనతో కౌలురైతు మానసికంగా కృంగిపోతుంటారు.

- తద్వారా అనేక రోగాలకు, రుగ్మతలకు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వేరే మార్గం లేక ప్రభుత్వాలు కనుకరించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భాదిత కుటుంబాలకు కౌలుగుర్తింపు కార్డు (భూ యజమాని కార్డు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో) లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్ గ్రేషియా అందనటువంటి దయనీయమైన స్థితిలో కౌలు ఉన్నారు.

- ఓట్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ పథకం పెడితే బ్యాంకులో ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నారు. దీని వల్ల కౌలురైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పథకాల ద్వారా భూ యజమానులే లబ్ధి పొందుతున్నారు.

- ప్రస్తుతం రాష్ట్రంలో 25శాతం మంది భూ యజమానులే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.

- మరి కొంత మంది సొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు.

- ముఖ్యంగా సొంత భూమి లేని పేదలు కౌలుకు భూమి తీసుకుని సాగు చేసే వారు గణనీయంగా ఉన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More