కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి కేటాయింపులు.. పలు విద్యా సంస్థలకు పరిశోధన గ్రాంట్లు!

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా అమరావతికి, పోలవరం నిర్మాణానికి సైతం నిధులు ప్రకటించారు.

Published on: Feb 1, 2026, 16:16:36 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, విద్యకు స్పష్టమైన నిధుల కేటాయింపులు ఉన్నాయి. అమరావతి అభివృద్ధి చేయడానికి వివిధ విభాగాలకు నిధులు మంజూరు చేశారు.

అమరావతి
అమరావతి

మొత్తం మీద రాజధాని అభివృద్ధికి సుమారు రూ. 1128.91 కోట్లు కేటాయించారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ఐబీఆర్‌డీ నిధుల ద్వారా రూ. 432.09 కోట్లు లభించాయి. రాష్ట్రంలో పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదల మెరుగుదలలకు రూ. 800 కోట్లు కేటాయించగా, రోడ్లు, వంతెనల పునర్నిర్మాణానికి రూ. 350 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ. 500.99 కోట్లు కేటాయింపులు ఉన్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 3320.39 కోట్లు ప్రకటించారు.

వ్యవసాయ రంగంలో సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి రూ. 155.32 కోట్లు కేటాయించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పరిశోధన గ్రాంట్లను కూడా ప్రకటించింది. అణుశక్తి శాఖ కింద ఎస్ఆర్ఎం అమరావతి, గీతం విశ్వవిద్యాలయం మద్దతు పొందాయి. అంతరిక్షం కింద అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కోసం వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (విజయవాడ), ఐఐఐటీ శ్రీ సిటీ, గీతం బెంగళూరు వంటి సంస్థలు నిధుల కోసం ఎంపిక చేశారు.

మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో టూరిజానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరకులోయపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అరకులోయ ట్రెక్కింగ్, ఎకో టూరిజం, నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రంగా మార్చనుంది ప్రభుత్వం. అంతేకాదు పులికాట్‌లో పక్షులను చూసేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి.

అరకు లోయను దేశంలోని ప్రధాన ట్రెక్కింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ అన్నారు. పర్వతదారులను మరింత సురక్షితంగా, పరిరక్షణతో రూపొందిస్తామన్నారు. దీనితో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు భద్రతా, అనుభవపరంగా మెరుగైన సేవలు పొందుతారు. ఈ మేరకు కేంద్రం అరకులో టూరిజాన్ని అభివృద్ధి చేయనుంది. పులికాట్ సరస్సు వెంబడి పక్షులను చూసేందుకు మూడు బర్డ్ వాచింగ్ ట్రైల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

బడ్జెట్‌పై నారా లోకేష్ రియాక్షన్

కేంద్ర బడ్జెట్‌ను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ స్వాగతించారు. ఇది భారత వేగవంతమైన వృద్ధి, దీర్ఘకాలిక ఆకాంక్షలకు అనుగుణంగా సమతుల్యమైన రోడ్ మ్యాప్ అని అభివర్ణించారు. అభివృద్ధికి మద్దతు ఇచ్చే బడ్జెట్‌ను సమర్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

కీలకమైన ఖనిజ కారిడార్, హై-స్పీడ్ రైలు కనెక్టివిటీ, డేటా సెంటర్లకు పన్ను ప్రోత్సాహకాలు, ఎలక్ట్రానిక్స్ తయారీకి బలమైన ప్రోత్సాహం, పర్యాటక రంగంపై కొత్త దృష్టి వంటి కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌ గణనీయమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. ఈ చర్యలు పెట్టుబడులను వేగవంతం చేయడానికి, ఉపాధి కల్పనను పెంచడానికి, అభివృద్ధి చెందుతున్న రంగాలలో రాష్ట్ర స్థానాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More