బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీకి చెందిన BSF జవాన్ వేణు మృతి - నదిలో మృతదేహాం లభ్యం

అస్సాంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద స్మగ్లర్లను వెంబడిస్తూ ఏపీకి చెందిన 31 ఏళ్ల బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కదిమి వేణు నదిలో మునిగి మృతి చెందారు. రెండు రోజుల గాలింపు తర్వాత కుషియారా నదిలో మృతదేహం లభ్యమైంది. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Published on: Nov 27, 2026, 12:19:39 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కదిమి వేణు (31) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట అనుమానిత పశువుల స్మగ్లర్లను వెంబడించే క్రమంలో ఈ విషాదం జరిగింది.

బీఎస్ఎఫ్ జవాను కదిమి వేణు
బీఎస్ఎఫ్ జవాను కదిమి వేణు

వేణు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని కొత్తపల్లె గ్రామం. అస్సాంలోని కచార్ జిల్లాలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ సిబ్బంది అనుమానిత పశువుల అక్రమ రవాణా ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

బరాక్ నదిలోకి దిగి గాలింపు.. జవాను గల్లంతు

అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే అనుమానితులను పట్టుకునేందుకు బీఎస్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వారిని వెంబడించే సమయంలో వేణుతో పాటు హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర యాదవ్ బరాక్ నదిలోకి దిగారు. ప్రవాహంలో జితేంద్ర యాదవ్ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వేణు మాత్రం నదిలో గల్లంతయ్యారు.

వేణు కనిపించకుండా పోయిన వెంటనే బీఎస్‌ఎఫ్ అధికారులు ఆయన కుటుంబానికి సమాచారం అందించారు. అనంతరం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు.

దాదాపు రెండు రోజుల పాటు బీఎస్‌ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలించాయి. బుధవారం ఉదయం వేణు మృతదేహం బయటపడింది. వేణు గల్లంతైన ప్రాంతానికి సుమారు 25 కిలోమీటర్ల దిగువన మృతదేహాన్ని గుర్తించారు. అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో కుషియారా నదిలో మృతదేహం లభించిందని బీఎస్‌ఎఫ్ అధికారులు ధ్రువీకరించారు.

మృతదేహం దొరకడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. కొత్తపల్లె గ్రామానికి చెందిన యువ జవాను సరిహద్దులో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సీఎం చంద్రబాబు సంతాపం

యువ జవాను అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

"ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కదిమి వేణు అస్సాంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విధుల్లో ఉన్నప్పుడు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను," అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. చిన్న వయసులోనే వేణు మృతి చెందడం ఎంతో బాధాకరమని, విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామన్న భావనతో సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.