చంద్రబాబు పాలనలో విధ్వంసం... హే రామ్‌....ఆలయాలను కాపాడండి - వైఎస్ జగన్

అంజనేయపురంలో శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ కూల్చివేతపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. గతంలో జరిగిన ఆలయాల తొలగింపులను ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.

Published on: Nov 23, 2026, 21:21:07 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల కూల్చివేత వ్యవహారం మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ జగన్…. ఈ ఘటన కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం

చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో జరిగిన పలు ఆలయాల కూల్చివేత ఉదంతాలను వైఎస్ జగన్ తన ప్రకటనలో గుర్తుచేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేసే ధోరణి కొనసాగుతోందని ఆయన విమర్శించారు.

"హే రామ్.. ఆలయాలను కాపాడండి, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి. చంద్రబాబు గారి పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది. తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు ఇదే తీరు కనిపిస్తోంది" అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

శ్రీవాణి ట్రస్టు వర్సెస్ బుల్డోజర్లు

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి తీసుకున్న చర్యలను, ప్రస్తుత ప్రభుత్వ తీరును పోలుస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "వైయస్సార్‌సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసింది. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది. మీ ప్రభుత్వ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.

అంజనేయపురం ఘటనపై భక్తుల మనోభావాలను గౌరవించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. చారిత్రక ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.