బెంగళూరు ప్యాలెస్‌లోకి షర్మిలకు నో ఎంట్రీ.. కోర్టు ద్వారా చెక్ పెట్టిన జగన్!

బెంగళూరు ప్యాలెస్‌లోకి షర్మిల రాకుండా కోర్డు ద్వారా అడ్డుకున్నారు. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ప్యాలెస్‌లోకి షర్మిల ఆమె తరఫున వారి ప్రవేశాన్ని నిలువరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Nov 22, 2026, 09:06:01 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సోదరి వైఎస్ షర్మిలా రెడ్డికి మధ్య కొనసాగుతున్న ఆస్తి వివాదంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. యలహంక ప్యాలెస్ ఆస్తిలోకి షర్మిలా ప్రవేశించకుండా లేదా దాని స్వాధీనంలో జోక్యం చేసుకోకుండా దేవనహళ్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

వైఎస్సార్‌సీపీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఉత్తర్వు ఆమె కుటుంబ సభ్యులు, ఏజెంట్లు, ప్రతినిధులు, ఆమె తరఫున వ్యవహరించే ఇతరులు ఆ ఆస్తికి ఎలాంటి ఆటంకం లేదా జోక్యం కలిగించకుండా కూడా నిషేధిస్తుంది. ఆస్తిపై తమ స్వాధీన, లీజు హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన దావాపై కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

కంపెనీ సమర్పించిన లీజు ఒప్పందం, అద్దె చెల్లింపుల రికార్డులు, విద్యుత్ బిల్లులు, భద్రతకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాత, ఆస్తి స్వాధీన హక్కుకు మద్దతు ఇచ్చే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, మధ్యంతర రక్షణ అవసరమని కోర్టు పేర్కొంది.

మధ్యంతర ఉపశమనం కోసం దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించే ముందే షర్మిలకు ముందస్తు నోటీసు జారీ చేయడం, పిటిషన్ అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే తదుపరి విచారణ తేదీ డిసెంబర్ 19, 2026 వరకు బెంగళూరు ప్యాలెస్‌లోకి అనుమతి ఉండదని, ఆ మేరకు ఈ నిషేధాజ్ఞ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

సిలికాన్ బిల్డర్స్ ప్రకారం.. బెంగళూరు నార్త్ తాలూకాలోని కట్టిగెనహళ్లి గ్రామంలోని ఆస్తి 2006 నుండి దాని సంపూర్ణ యజమానిగా పేర్కొనిన ఈసీ సుగుణమ్మతో కుదిరిన ఒప్పందం ప్రకారం, మార్చి 1, 2007 నుండి లీజులో ఉంది. ఈ లీజు ఫిబ్రవరి 28, 2027 వరకు చెల్లుబాటులో ఉంది. తాము క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తూ, విద్యుత్, నీరు, భద్రత, నిర్వహణ ఖర్చులను భరిస్తున్నామని ఆ కంపెనీ పేర్కొంది. అంతేకాదు లీజులో భాగంగా తాము అక్కడ పండ్ల తోటలు, గెస్ట్‌హౌస్‌ల అభివృద్ధికి భారీగా ఖర్చు చేశామని పిటిషనర్ తరఫున న్యాయవాది సుధీర్ మేడమ్మయ్య కోర్టుకు వివరించారు.

ఆ ప్రాంగణంలోని అతిథి గృహంలో తాత్కాలికంగా ఉండేందుకు షర్మిలకు గతంలో అనుమతి ఇచ్చామని, కానీ ఆ తర్వాత ఆమె తన తరపున ఇతరులను పంపిస్తూ, తమ స్వాధీనానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆ కంపెనీ కోర్టుకు తెలియజేసింది. అక్కడ నివసిస్తున్న తమ ప్రమోటర్లు, డైరెక్టర్ల భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

యలహంకలోని తమ ఆస్తిలో తన కుమార్తె అంజలి వివాహం జరపాలన్న షర్మిల ప్రణాళికపై తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ న్యాయపరమైన పరిణామం చోటుచేసుకుంది. ఆమె వివాహ వేదికను పేర్కొంటూ ఆహ్వాన పత్రికలను ముద్రించి పంపిణీ చేశారు. అయితే జగన్ అభ్యంతరం తెలపడంతో ఆమె వివాహ వేదికను మార్చారు.

జగన్ తన సోదరికి రాసిన లేఖలో, తాను నివసిస్తున్న చోట వివాహ వేడుకను నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటం తన కుటుంబ భద్రతకు తీవ్ర ముప్పు కలిగించవచ్చని జగన్ పేర్కొన్నారు.

ఇక విషయంపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కావాలనే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు ముందు మళ్లీ షర్మిలతో నాటకం ఆడిస్తున్నారని అంటున్నారు. బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్లేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. యలహంక ఆస్తి దగ్గర షర్మిల నిరసన తెలిపితే.. పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం అనుకుంటోందని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.