కర్నూలులో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు ఆలయం.. భూమిపూజలో బీజేపీ, జనసేన, వైసీపీ నేతలు

కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు ఆలయం నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి భూమిపూజ చేయగా.. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.

Published on: Nov 17, 2026, 15:12:01 IST
By , Kurnool
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి, దివంగత హీరాబెన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం నిర్మితమవుతోంది. తల్లిపై కుమారుడికి ఉండే అపారమైన భక్తిప్రపత్తులకు, గౌరవానికి ప్రతీకగా కర్నూలు జిల్లాలో ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలోని అర ఎకరం స్థలంలో మాత శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ప్రధాని మోదీ తల్లికి ఆలయం
ప్రధాని మోదీ తల్లికి ఆలయం

ఈ భూమిపూజ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశేషమేమిటంటే ఈ కార్యక్రమానికి బీజేపీతో పాటు జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తల్లిగారికి ఆలయం నిర్మించడం దేశంలోనే ఇది మొట్టమొదటిదని పేర్కొన్నారు. 'ప్రధానమంత్రి దేశానికి పెద్దదిక్కు. అలాంటి గొప్ప నాయకుడికి జన్మనిచ్చిన మాతృమూర్తికి ఆలయం నిర్మించడం అంటే, దేశంలోని సమస్త తల్లులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించాలి.' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆలయ నిర్మాణ వివరాలను మాత శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు శివకుమార్ మీడియాకు వెల్లడించారు. దాతల నుంచి విరాళాలు సేకరించి ఈ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. హీరాబెన్ మోదీకి నివాళిగా సుమారు రూ.3 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించామని, విగ్రహ ప్రతిష్ఠాపనకు సిద్ధంగా ఉందని శివకుమార్ పేర్కొన్నారు.

ఈ ఆలయ సముదాయంలో హీరాబెన్ మోదీ మందిరంతో పాటు పరమశివుడు, దక్షిణామూర్తి, శ్రీరాముడు, మహాగణపతి ఆలయాలను కూడా నిర్మిస్తున్నట్లు వివరించారు. దాతల ఉదార విరాళాలతో రాబోయే రెండు నెలల్లోనే ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేసి, విగ్రహ ప్రతిష్ఠాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

కేవలం ఆలయ నిర్మాణానికే పరిమితం కాకుండా ఈ ప్రాంగణంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాలని ఛారిటబుల్ సొసైటీ నిర్ణయించింది. ఆలయ సముదాయంలో భాగంగా అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక అనాథాశ్రమం, గోవుల సంరక్షణార్థం ఒక గోశాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శివకుమార్ వెల్లడించారు. తల్లి ప్రేమకు నిదర్శనంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More