TTD Srivani Tickets : సిస్టమ్ అంతా ఆటోమేటిక్‌గానే..! శ్రీవాణి టికెట్ల గోల్ మాల్ ఆరోపణలపై టీటీడీ వివరణ

TTD Srivani ticket Booking : శ్రీవాణి ట్రస్ట్ ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని టీటీడీ స్పష్టం చేసింది. సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేసింది. టీటీడీ మాజీ ఛైర్మన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది.

Published on: May 17, 2026, 08:44:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TTD Srivani ticket Booking : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ ఆన్‌లైన్ టికెట్ల కేటాయింపు ప్రక్రియపై వస్తున్న విమర్శలను తీవ్రంగా టీటీడీ ఖండించింది. భక్తులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ అత్యంత వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) సహకారంతో 2019 మే నెలలో ప్రారంభించిన ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ విధానాన్నే ప్రస్తుతం కొనసాగిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

శ్రీవాణి టికెట్ల బుకింగ్‌పై టీటీడీ క్లారిటీ
శ్రీవాణి టికెట్ల బుకింగ్‌పై టీటీడీ క్లారిటీ

గతంలో తిరుమలలో ఏరోజుకారోజు ఆఫ్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేసే విధానం ఉండేది. అయితే భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ఈ విధానంలో మార్పులు చేశారు. కొత్త విధానం ప్రకారం... ముందుగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను యాక్సెస్ చేసిన వారికే ప్రాధాన్యత లభిస్తుంది. ప్రస్తుతం ఈ టికెట్ల కోసం రోజుకు వేల సంఖ్యలో భక్తులు ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో…. బుకింగ్ ప్రారంభమైన మొదటి ఒకటిన్నర నిమిషంలోనే ‘ముందు వచ్చిన వారికి ముందే’ (ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్) ప్రాతిపదికన సిస్టమ్ టికెట్లను లాక్ చేస్తుంది.

ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి మానవ ప్రమేయం లేదని, సిస్టమ్ అంతా ఆటోమేటిక్‌గా పనిచేస్తుందని టీటీడీ స్పష్టం చేసింది. మొదట లాక్ అయిన టికెట్లకు సంబంధించి, పేమెంట్ గేట్‌వే ద్వారా నిధులు విజయవంతంగా చెల్లిస్తేనే టికెట్ జారీ అవుతుంది. సాంకేతిక కారణాల వల్ల లేదా నెట్‌వర్క్ సమస్యల వల్ల చెల్లింపులు విఫలమైతే, ఆ టికెట్లను సిస్టమ్ ఆటోమేటిక్‌గా తిరిగి ప్రధాన పూల్‌లోకి తీసుకువస్తుంది. ఐఆర్సీటీసీ (IRCTC) సహా ప్రభుత్వానికి చెందిన ఇతర అడ్వాన్స్ బుకింగ్ సర్వీసుల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.

బుకింగ్ ప్రారంభమైన పది నిమిషాల తర్వాత కూడా టికెట్లు లభించడం వెనుక ఉన్న సాంకేతికతను టీటీడీ వివరించింది. పేమెంట్ గేట్‌వే వద్ద భక్తులు డబ్బులు చెల్లించేటప్పుడు సాంకేతిక లోపాల వల్ల టీటీడీ ఖాతాకు నగదు జమ అయినట్లు సందేశం రాకపోతే, ఆ టికెట్లను భక్తుల సౌకర్యార్థం సాఫ్ట్‌వేర్ మళ్లీ పూల్‌లోకి చేర్చుతుంది. అందువల్లే ఆ తర్వాత ప్రయత్నించే వారికి కూడా టికెట్లు దొరుకుతున్నాయి.

తప్పుడు ప్రచారం వద్దు…

టీటీడీ ఐటీ జనరల్ మేనేజర్ (GM IT) నియామకంపై వస్తున్న ఆరోపణలను అధికారులు పూర్తిగా కొట్టిపారేశారు. కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారనడం వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారికి ఎం.టెక్ (కంప్యూటర్ సైన్స్), ఎం.ఎస్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) లాంటి ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. దీనికి తోడు ఐటీ రంగంలో ఆయనకు 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. కేవలం ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్‌ (తాత్కాలిక ఏర్పాటు) కింద మాత్రమే ఆయనను ఐటీ జీఎం ఎఫ్‌ఏసీ (FAC)గా నియమించినట్లు టీటీడీ స్పష్టం చేసింది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. టీసీఎస్ సంస్థ కొత్తగా ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టలేదు. 2019 నాటి సాఫ్ట్‌వేర్‌నే వాడుకలో ఉంచారు. అయితే భక్తుల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా కాలానుగుణ మార్పులను టీసీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఆటో ఫిల్లింగ్, కాపీ-పేస్ట్ ఆప్షన్లను సాఫ్ట్‌వేర్‌లో పూర్తిగా రద్దు చేశారు. అలాగే టీటీడీలోని అన్ని ఐటీ సిస్టమ్స్‌ను ప్రతి ఏటా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ద్వారా క్రమబద్ధంగా ఆడిట్ చేయిస్తున్నారు.

మాజీ ఛైర్మన్ బుకింగ్ ఫెయిల్ - కారణం ఇదే!

ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో టీటీడీ మాజీ ఛైర్మన్ ప్రదర్శించిన శ్రీవాణి టికెట్ బుకింగ్ ప్రక్రియపై టీటీడీ స్పందించింది. ఆయన పూర్తి అవగాహన లేకుండా మాట్లాడినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆయన పేమెంట్ గేట్‌వే వరకు వెళ్లడం నిజమే అయినా…. దానిని సాంకేతిక లోపంగా చిత్రీకరించడం సరికాదన్నారు. వాస్తవానికి ఆయన బ్యాంకు ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేనందు వల్లే పేమెంట్ గేట్‌వే దగ్గర ఆ లావాదేవీ రిజెక్ట్ అయిందని పేర్కొంది.

ఆ లావాదేవీ విఫలమైన తర్వాత ఆయన తిరిగి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే సిస్టమ్ దానిని సరికొత్త ప్రయత్నంగానే పరిగణిస్తుంది. అప్పటికే లైన్లో ఉన్న ఇతర భక్తులను సాఫ్ట్‌వేర్ ప్రాధాన్యత క్రమంలోకి తీసుకుంటుంది. దీనివల్ల మాజీ ఛైర్మన్ వెయిటింగ్ లిస్టులో వెనుకబడిపోయారు. ఈ చిన్న సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అసలు విషయం సులభంగా అర్థమవుతుందని టీటీడీ వివరణ ఇచ్చింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More