APSRTC Free Bus Scheme : ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది - ఇప్పటికి 87 కోట్ల ప్రయాణాలు…!
APSRTC Free Bus Scheme : ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదు కాగా… ప్రభుత్వం రూ.3,095 కోట్లు సబ్సిడీగా వెచ్చించింది.
APSRTC Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆర్థిక సాధికారతకు ‘స్త్రీ శక్తి’ పథకం కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 15న ఈ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ వారి రోజువారీ ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గిస్తోంది.

రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా పరిమితులు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం ప్రాంరంభం నాటి నుంచి ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలను వివిధ వర్గాల మహిళలు చేశారు. మహిళల ప్రయాణానికి ప్రభుత్వం రోజుకు రూ.8.53 కోట్లను సబ్సిడీగా అందిస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటివరకు రూ.3,095 కోట్లు ఈ పథకం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ.. ఇలా ఐదు కేటగిరీల బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. మొత్తం 9,978 ఆర్టీసీ బస్సుల్లో 76 శాతం బస్సులు .. అంటే 7,631 బస్సులను ఈ పథకానికి వినియోగిస్తున్నారు. ఆలయాలకు నడిపే ప్రత్యేక బస్సు సర్వీసుల్లోనూ ఈ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. స్త్రీ శక్తి పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వాటా 40 శాతం ఉండగా.. ఇప్పుడు అది 62 శాతానికి పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 9.47 లక్షల నుంచి 24 లక్షలకు చేరుకుంది. పథకం అమలవుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ 93 శాతానికి చేరింది.
స్త్రీ శక్తి పథకం ద్వారా కేవలం ప్రయాణ ఖర్చును తగ్గించడం మాత్రమే కాకుండా.. మహిళలకు విద్య, ఉపాధి, వైద్యం, వ్యాపారం, ఇతర అవసరాలకు ఉపయోగపడుతోంది. కాలేజీలకు వెళ్లే వారికి, చిరు వ్యాపారం నిమిత్తం ఒక ఊరి నుంచి మరొక ఊరు వెళ్లేవారికి, దైవ దర్శనాలకు వెళ్లేవారికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆధార్ కార్డును చూపిస్తే రాష్ట్ర సరిహద్దులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహా పథకాన్ని 4 కేటగిరి బస్సుల్లోనే అమలు చేస్తున్నారు. కాగా ఏపీలో 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. మరోవైపు ఈ పథకం అమలు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. చాలా మంది షేర్ ఆటోలు, వ్యక్తిగత వాహనాల ద్వారా ప్రయాణాలను తగ్గించుకుని ఆర్టీసీ బస్సులు ఎక్కుతుండడంతో ప్రమాదాల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్టు అంచనా.
మహిళలతో ముఖాముఖి..
పథకం ప్రవేశపెట్టి ఏడాదైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం(ఆగస్ట్ 15) మహిళలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. “స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం” పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టనున్నారు. రాజధాని పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవాల కార్యక్రమం అనంతరం “స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం” కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పరేడ్ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు స్త్రీశక్తి లబ్దిదారులతో కలిసి బస్సులో ముఖ్యమంత్రి ప్రయాణించనున్నారు. క్యాంప్ కార్యాలయంలో మహిళలతో కలిసి హై-టీలో పాల్గొననున్నారు. పథకం అమలవుతున్న తీరు... కలుగుతున్న లబ్ది వంటి అంశాలపై మహిళలతో మాట్లాడి.. వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

