ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్ బావి నుంచి లీకేజీ సంభవించడం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామ పరిధిలోని 216వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓఎన్‌జీసీ గ్యాస్ బావి వద్ద మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బావి వద్ద వర్క్‌ఓవర్ ఆపరేషన్స్(మరమ్మతులు, పునరుద్ధరణ పనులు) జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయపడ్డారు.

గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్ అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలులోకి తెచ్చారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హుటాహుటిన గెద్దాడ బావి వద్దకు చేరుకుని, బావిని నియంత్రించే పనులతో పాటు భద్రతా చర్యలను ప్రారంభించింది. పరిస్థితిని మరింత వేగంగా అదుపులోకి తెచ్చేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రీజినల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కేంద్రం నుంచి అదనపు నిపుణులు, భారీ యంత్రాలు, ప్రత్యేక పరికరాలను సంఘటనా స్థలానికి తరలించారు.
ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందుజాగ్రత్త చర్యలుగా కఠిన ఆంక్షలు విధించారు. గ్యాస్ బావి చుట్టూ 500 మీటర్ల పరిధిని పూర్తిగా దిగ్బంధించి, ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా కట్టడి చేశారు. సమీప నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బావికి అతి సమీపంలోనే 216వ జాతీయ రహదారి ఉండటంతో, ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. గ్యాస్ లీకైన ప్రాంతంలో చిన్న నిప్పురవ్వ పడినా భారీ అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉన్నందున, ముందుజాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. మంటలు చెలరేగకుండా నిరోధించేందుకు బావి చుట్టూ నిరంతరాయంగా నీటిని విరజిమ్మే వాటర్ బ్లాంకెట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఘటనా స్థలంలో గ్యాస్ సాంద్రతను నిపుణులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం పర్యవేక్షించిన ప్రదేశాల్లో గ్యాస్ సాంద్రత సున్నాగా నమోదైందని, ప్రస్తుతం ఎలాంటి పెను ప్రమాదం లేదని ఓఎన్‌జీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ, నిరంతర పర్యవేక్షణ, భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
{{/usCountry}}ఘటనా స్థలంలో గ్యాస్ సాంద్రతను నిపుణులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం పర్యవేక్షించిన ప్రదేశాల్లో గ్యాస్ సాంద్రత సున్నాగా నమోదైందని, ప్రస్తుతం ఎలాంటి పెను ప్రమాదం లేదని ఓఎన్‌జీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ, నిరంతర పర్యవేక్షణ, భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
{{/usCountry}}కోనసీమ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేశామని ఓఎన్‌జీసీ స్థానిక యాజమాన్యం వెల్లడించింది. తమ సిబ్బందితో పాటు పరిసర గ్రామాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వీలైనంత త్వరగా బావిని పూర్తిస్థాయిలో సురక్షితంగా నియంత్రణలోకి తెస్తామని సంస్థ భరోసా ఇచ్చింది.
కోనసీమ ప్రాంతంలో తరచూ ఓఎన్‌జీసీ బావుల వద్ద గ్యాస్ లీక్ ఘటనలు చోటుచేసుకోవడం స్థానిక ప్రజలను కలవరపెడుతోంది. తెల్లవారుజామున గ్యాస్ లీక్ వార్త తెలియగానే గెద్దాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.