Andhra Gas Leak : కోనసీమ గ్యాస్ లీక్.. 500 మీటర్లు రెడ్ జోన్.. కరెంట్ కట్.. ఓఎన్‌జీసీ ప్రకటన!

Andhra Gas Leak : కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఓఎన్‌జీసీ ఆయిల్ అవసరమైన నియంత్రణ చర్యలను చేపడుతోంది. వర్క్‌ఓవర్ ఆపరేషన్ల సమయంలో ఈ సంఘటన జరిగింది.

Published on: Nov 17, 2026, 12:32:42 IST
By , Konaseema
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్ బావి నుంచి లీకేజీ సంభవించడం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామ పరిధిలోని 216వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓఎన్‌జీసీ గ్యాస్ బావి వద్ద మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బావి వద్ద వర్క్‌ఓవర్ ఆపరేషన్స్(మరమ్మతులు, పునరుద్ధరణ పనులు) జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయపడ్డారు.

కోనసీమ గ్యాస్ లీక్ (X)
కోనసీమ గ్యాస్ లీక్ (X)

గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్ అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలులోకి తెచ్చారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హుటాహుటిన గెద్దాడ బావి వద్దకు చేరుకుని, బావిని నియంత్రించే పనులతో పాటు భద్రతా చర్యలను ప్రారంభించింది. పరిస్థితిని మరింత వేగంగా అదుపులోకి తెచ్చేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రీజినల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కేంద్రం నుంచి అదనపు నిపుణులు, భారీ యంత్రాలు, ప్రత్యేక పరికరాలను సంఘటనా స్థలానికి తరలించారు.

ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందుజాగ్రత్త చర్యలుగా కఠిన ఆంక్షలు విధించారు. గ్యాస్ బావి చుట్టూ 500 మీటర్ల పరిధిని పూర్తిగా దిగ్బంధించి, ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా కట్టడి చేశారు. సమీప నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

బావికి అతి సమీపంలోనే 216వ జాతీయ రహదారి ఉండటంతో, ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. గ్యాస్ లీకైన ప్రాంతంలో చిన్న నిప్పురవ్వ పడినా భారీ అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉన్నందున, ముందుజాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. మంటలు చెలరేగకుండా నిరోధించేందుకు బావి చుట్టూ నిరంతరాయంగా నీటిని విరజిమ్మే వాటర్ బ్లాంకెట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఘటనా స్థలంలో గ్యాస్ సాంద్రతను నిపుణులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం పర్యవేక్షించిన ప్రదేశాల్లో గ్యాస్ సాంద్రత సున్నాగా నమోదైందని, ప్రస్తుతం ఎలాంటి పెను ప్రమాదం లేదని ఓఎన్‌జీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ, నిరంతర పర్యవేక్షణ, భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

కోనసీమ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేశామని ఓఎన్‌జీసీ స్థానిక యాజమాన్యం వెల్లడించింది. తమ సిబ్బందితో పాటు పరిసర గ్రామాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వీలైనంత త్వరగా బావిని పూర్తిస్థాయిలో సురక్షితంగా నియంత్రణలోకి తెస్తామని సంస్థ భరోసా ఇచ్చింది.

కోనసీమ ప్రాంతంలో తరచూ ఓఎన్‌జీసీ బావుల వద్ద గ్యాస్ లీక్ ఘటనలు చోటుచేసుకోవడం స్థానిక ప్రజలను కలవరపెడుతోంది. తెల్లవారుజామున గ్యాస్ లీక్ వార్త తెలియగానే గెద్దాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More