వికలాంగులు, బాధితులకు బాసటగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను (ఆర్టిఫిషియల్ ఆర్గాన్ మేకింగ్ యూనిట్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్‌చైర్లు, శ్రవణ పరికరాలు (హియరింగ్ ఎయిడ్స్) వంటి సహాయక పరికరాలను నేరుగా అందిస్తారు.

రాష్ట్రంలో ఇలాంటి ప్రత్యేక విభాగాలను తీసుకురావడం ఇదే తొలిసారి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల సూచనల మేరకు… వికలాంగులకు నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులను ఉచితంగా అందించడం ద్వారా వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
5 ఆస్పత్రుల్లో కేంద్రాలు…
మొదటి విడత కింద రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో (జీజీహెచ్) ఈ తయారీ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం నగరాలలోని ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు ఈ మొదటి విడత జాబితాలో ఉన్నాయి.
రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీలోని మొత్తం 27 జిల్లాల్లోనూ జిల్లాకు ఒకటి చొప్పున కృత్రిమ అవయవ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
సీఎం విజ్ఞప్తికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో….. తొలి దశలో భాగంగా ఈ ఐదు ప్రధాన బోధనా ఆసుపత్రుల్లో యూనిట్ల ఏర్పాటుకు మార్గం సుగమమైందని ఆయన వివరించారు. ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే వేలాది మంది వికలాంగులకు స్థానికంగానే అత్యాధునిక కృత్రిమ అవయవాలు లభిస్తాయి.