వడ్డెర్లకు ప్రత్యేకంగా మైనింగ్ లీజులు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మైనింగ్ లో శాటిలైట్, డ్రోన్ చిత్రాల ద్వారా విశ్లేషణ చేయాలని సూచించారు. వడ్డెర్లకు మైనింగ్ లీజుల విధానం సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.

Published on: Oct 18, 2025, 09:22:26 IST
PTI | By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం వస్తుందని సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖ, ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు సమీక్ష

మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూ.3320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంతో పోలిస్తే 34 శాతం మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతానికి పైగా ఆదాయం వస్తోందని వివరించారు.

అధికారులు సమర్పించిన వివరాలపై స్పందించిన సీఎం చంద్రబాబు…. ఏపీలో ఉన్న మినరల్ వెల్త్ విలువను అంచనా వేయాలని సూచించారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని.. రూ.50 వేల కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తోందని తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారు చేసి విలువ జోడిస్తే రూ.20-30 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. పెండింగ్ లో ఉన్న 6500 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.

మార్గదర్శకాలు రూపోందించండి - సీఎం

వడ్డెర సాజామికవర్గానికి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వారికి మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై విధానాన్ని తయారు చేయాలని చంద్రబాబు సూచించారు. వడ్డెర్లు, సొసైటీలకు 15 శాతం మేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్ లో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెనుకబడిన వర్గాలైన వడ్డెర్లకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగేలా లీజు కేటాయింపు విధానాన్ని రూపోందించాలని స్పష్టం చేశారు. సీనరేజి, ప్రీమియం మొత్తాల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశించారు.

మైనింగ్ లీజుల కేటాయింపుతో పాటు వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని అన్నారు. రాష్ట్రంలో గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించాలన్నారు. అనలటిక్స్ ను వినియోగించుకుని జరిగిన తవ్వకాలను అంచనా వేయాలన్నారు. బీచ్ శాండ్ మినరల్స్ లాంటి భార ఖనిజాల మైనింగ్ తో పాటు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అలాగే కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుము ఖనిజం సరఫరా పై కూడా అధ్యయనం చేయాలని సూచించారు.

కఠిన నిబంధనలు అమలు చేయాలి..

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం కలగాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఉచిత ఇసుక సరఫరాను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వినియోగించుకుని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సీజన్ కోసం 66.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశామని.. ప్రస్తుతం అన్ని స్టాక్ పాయింట్లలోనూ 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనం దక్కేలా ఇసుక లభ్యత జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇసుక లోడింగ్ తో పాటు రవాణాకు అతితక్కువ వ్యయం అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక లభ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని రూట్లలో పెట్టిన సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేయాలని సీఎం సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More