AP EAPCET Results 2026 : ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET) 2026 పరీక్షలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఈ పరీక్షలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి అందించిన గణాంకాల ప్రకారం….. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది పరీక్ష రాశారు. అంటే మొత్తం 92.60 శాతం హాజరు నమోదైంది.
- ఇంజినీరింగ్, ఫార్మసీ (MPC స్ట్రీమ్): ఈ విభాగానికి అత్యధికంగా 2,76,576 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ విభాగంలో అత్యధికంగా 93.48 శాతం హాజరు నమోదైంది.
- వ్యవసాయ, ఫార్మసీ (BiPC స్ట్రీమ్): అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి మొత్తం 79,227 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ స్ట్రీమ్‌లో 89.53 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్షలు ముగిసిన నేపథ్యంలో అభ్యర్థుల కోసం అన్ని సెషన్ల పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల ‘కీ’ని ఈ నెల 23న (మే 23) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే, వాటిని మే 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ ప్రాథమిక కీ లను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జూన్ 1న ఫలితాలు..!
అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసిన అనంతరం, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి తుది కీని సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత జూన్ 1వ తేదీన ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలను (Results) అధికారికంగా విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఫలితాలను కూడా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే…. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.