ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం…. 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖ, అమరావతి, రాయలసీమ పేర్లతో ఈ జోన్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసిన ఏపీ సర్కార్… ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
3 జోన్లు…

విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలతో ఒక జోన్ ఏర్పాటు చేస్తే… అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో మరో జోన్ ఉంటుంది. ఇక రాయలసీమ 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనమిక్ రీజియన్ ఏర్పాటు కానున్నాయి. బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రతి జోన్ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఒక్కో జోన్ కు సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించనుంది. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను నీతి ఆయోగ్ , సింగపూర్ దేశానికి చెందిన ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. దీనికి అనుబంధంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో ఓ స్టీరింగ్ కమిటీని కూడా పని చేయనుంది. ఈ కొత్త జోన్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతోంది. మదనపల్లె, మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి.వీటి విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో ఆయా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ ఓవైపు జరుగుతుండగానే… మరోవైపు జోనల్ వ్యవస్థపై కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.