మెడికల్ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో… ఆర్టీసీ విలీనం తర్వాత (2020 జనవరి 1) మెడికల్ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి కలగనుంది.
ఇకపై వారికి కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు…

విలీనానికి ముందు మెడికల్ అన్‌ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఉండేవి. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లు సహా ఉద్యోగులందరికీ ప్రత్నామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.
కార్పొరేషన్‌లో ఉండగా 21 కేటగిరీల్లో మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి ప్రత్నామ్నాయ ఉద్యోగాలు కల్పించేవారు. విలీనం తర్వాతా 21 కేటగిరీల్లో మెడికల్ అన్‌ఫిట్ వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దక్కుతాయి. మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్ ఉద్యోగాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. వీరికి అసిస్టెంట్ మెకానిక్ /శ్రామిక్ ఉద్యోగాలు దక్కనున్నాయి.
ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత ప్రకారం ఉద్యోగాలు ఇస్తారు. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో అర్హత మేరకు ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పిస్తారు. ఏ ఉద్యోగానికీ అర్హత లేనివారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
మెడికల్ అన్‌ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్డ్ అవ్వాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు అందుతాయి. తాజా ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ రవాణశాఖ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది.