Andhrapradesh : 4 కేటగిరీలుగా గ్రామ పంచాయతీల విభజన - సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో కీలకమైన గ్రామ పంచాయతీలను వర్గీకరించే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా రూర్బన్‌ పంచాయతీని నిర్ణయించటంతో… ఇకపై రాష్ట్రంలో 4 రకాలు గ్రామ పంచాయతీలు ఉంటాయి.

Published on: Mar 10, 2026, 09:35:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్‌ వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. ఈ అంశంపై గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతుండగా…. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయి. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా రాష్ట్రంలో నాలుగు రకాల గ్రామ పంచాయతీలు ఉండనున్నాయి.

4 కేటగిరీలుగా గ్రామ పంచాయతీలు
4 కేటగిరీలుగా గ్రామ పంచాయతీలు

గ్రామంలోని జనాభా, వచ్చే ఆదాయం ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను పునర్‌ వర్గీకరించారు. ఇప్పటివరకు 3 రకాల గ్రామపంచాయతీలు ఉండగా… ఇకపై నాలుగు రకాలు ఉండున్నాయి. కొత్తగా రూర్బన్‌ పంచాయతీ ఉండనుంది.

ఇప్పటికే పంచాయతీల పునర్విభజన కోసం కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ రాష్ట్రంలోని 13,351 పంచాయతీలను నాలుగు గ్రేడ్‌లుగా విభజించింది. రూర్బన్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 పంచాయతీలుగా వర్గీకరించింది. ఇందులో భాగంగా అధిక జనాభా, ఆదాయం కలిగిన పలు గ్రామ పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా గుర్తించింది. వీటికి అధికారులుగా గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి నియమించాలని కమిటీ సూచించింది. కొత్తగా ఉండే రూర్బన్‌ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్‌ అధికారులను నియమించే అవకాశం ఉంది.

గ్రామ పంచాయతీల విభజనకు గతేడాదే రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే….పంచాయతీ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లోనూ పలు విభాగాల ద్వారా విస్తృతమైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక విభాగం, వీధిలైట్లు విభాగం, ఇంజనీరింగ్‌, రెవెన్యూ విభాగాలపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టబోతుంది.

గ్రామపంచాయతీలు - పునర్‌ వర్గీకరణ ఇలా..

  1. పది వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో అయితే జనాభా 5 వేల కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది.
  2. జనాభా 3 వేల నుంచి 10 వేల మధ్య ఉంటే గ్రేడ్‌-1 పంచాయతీలుగా ఉంటాయి. మండల ప్రధాన కేంద్ర పంచాయతీ గ్రేడ్‌-1 పరిధిలోకి రానుంది.
  3. జనాభా 2 వేల కంటే తక్కువ ఉంటే గ్రేడ్‌-2 పంచాయతీల పరిధిలో ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో అయితే 1,500 నుంచి 2వేల లోపు జనాభా ఉంటే సరిపోతుంది.
  4. జనాభా 1,500 కంటే తక్కువ ఉంటే గ్రేడ్‌-3 పంచాయతీలుగా ఉంటాయి.

పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే అంశంపై సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షించిన ఆయన…. పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించనున్నట్లు కూడా ప్రకటించారు. గతంలో ఉన్న వ్యవస్థలు పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా మారాయని కూడా అభిప్రాయపడ్డారు. గతంలో అమలు చేసిన క్లస్టర్‌ విధానంలోనూ ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. జనాభా, మండల కేంద్రం, గిరిజన, గిరిజనేత ప్రాంతం, ఆదాయం అనే అంశాలను విశ్లేషించుకుని గ్రేడ్లుగా విభజిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.

పంచాయతీల్లోనూ పట్టణ స్థాయి సౌకర్యాల కల్పనే లక్ష్యంగా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. పంచాయతీ కార్యాలయాల్లోనూ పౌర సేవలు సత్వరం అందేలా పునర్‌ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More