పంచాయతీ కేబినెట్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్.. వార్డు మెంబర్లకు శాఖల కేటాయింపులు!

కొత్త సర్పంచ్‌లు గ్రామాల్లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. పంచాయతీలోనూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిద్వారా పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెబుతున్నారు.

Published on: Feb 12, 2026, 11:05:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ మాదిరిగానే.. గ్రామంలోనూ కేబినెట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్డు మెంబర్లకు శాఖలు కేటాయిస్తున్నారు. ఇలా చేయడం వలన ఎవరి శాఖల బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తారని చెబుతున్నారు. ఒకటి రెండు గ్రామాల్లో మెుదలైన ఈ కొత్త ట్రెండ్ గురించి ఇప్పుడు చాలా గ్రామాలు ఆలోచిస్తున్నాయి.

గూడెం గ్రామంలో పంచాయతీ కేబినెట్
గూడెం గ్రామంలో పంచాయతీ కేబినెట్

పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సర్పంచ్‌లు ఇలాంటి కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు, ఆదర్శంగా ఉంటున్నారు. గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సేవ చేసేందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నామని సర్పంచులు చెబుతున్నారు. గ్రామ పాలకవర్గం అంటే సర్పంచ్ మాత్రమే కాదని.. వార్డు సభ్యులు కూడా సమాన బాధ్యతలతో పని చేయాలని అంటున్నారు.

ఈ కొత్త విధానంతో వార్డు మెంబర్లు తమ వార్డుకే పరిమితం కాకుండా.. సర్పంచ్‌తోపాటుగా అన్ని పనుల గురించి తెలుసుకుంటారు. గ్రామం అంతా సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. గ్రామ మంత్రివర్గంలో వార్డు మెంబర్లకు పలు శాఖలను కేటాయిస్తారు. ఆ శాఖ బాధ్యతలను మంత్రి మాదిరిగానే ఆ వార్డు సభ్యుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ వార్డు నాది కాదులే అనే భావన ఏ వార్డు మెంబర్‌లోనూ ఉండకూడదని, అందరూ సమానమే అని ఈ కొత్త విధానం ఉపయోగపడనుంది.

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామం, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో పంచాయతీ కేబినెట్‌లను ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. ఉదాహరణకు గూడెం గ్రామంలో వార్డు మెంబర్లకు శాఖల కేటాయింపులు చూసుకుంటే..

శాఖల కేటాయింపులు ఇలా

చిట్ల రామ్(సర్పంచ్), బుడిగే కుమారస్వామి (వ్యవసాయ శాఖ), తిప్పారపు అభిలాష్(క్రీడా శాఖ మరియు పారిశుధ్యం), పట్టి శ్రీనివాస్(వైద్యశాఖ), ఉప్పుల ప్రశాంత్ (విద్యుత్ శాఖ, తాగునీరు, రెవెన్యూ శాఖ), కర్ర సరిత శ్రీధర్(హౌసింగ్ శాఖ, పంచాయతీల వ్యవహారాలు), వీరముష్టి వెంకటస్వామి (విద్యాశాఖ), కర్ర అహల్య(మహిళా సంక్షేమ శాఖ), బుడిగే కారుణ్య(ఉపాధి హామీ శాఖ)కు ఇలా శాఖలు కేటాయించారు. అయితే వీటన్నింటిపై సర్పంచ్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తుంటారు.

'పారదర్శక పాలన అందించేందుకు వార్డు సభ్యులకు శాఖల కేటాయింపులు చేశాం. చిన్న వయసులో నాకు గ్రామ ప్రజలు బాధ్యతను అప్పగించారు. వారికి ఎల్లప్పుడూ సేవల చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఆలోచన చేశాను. వార్డు సభ్యులు ఈ విధానంతో మెరుగైన సేవలు అందిస్తారు. కేవలం వారి వార్డుకు మాత్రమే పరిమితం అవ్వరు. సర్పంచ్‌తోపాటుగా వార్డు మెంబర్లు సమానమే. మా గూడెం గ్రామం జాతీయస్థాయిలో అవార్డులు సాధించడమే లక్ష్యంగా ఈ శాఖలు కీలకంగా పనిచేస్తాయని నమ్ముతున్నాను.' అని హెచ్‌టీ తెలుగుతో సర్పంచ్ చిట్ల రామ్ చెప్పుకొచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More