దీపావళి పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఒక డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఈ డీఏ పెంపు నిర్ణయం…. 2024 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు డీఏ శాతం 33.67 ఉండగా… అది 37.31 శాతానికి పెరగనుంది.

ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి నెలకు రూ.165 కోట్ల అదనపు భారం పడుతుంది. పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్స్ డబ్బులు కూడా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని ఈ ఏడాది నవంబర్, 2026 జనవరిలో రెండు దఫాలుగా చెల్లిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు సోమవారం లోపు అందిస్తారు.
ఇటీవలే ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఒక డీఏపై నిర్ణయం తీసుకోవటమే కాకుండా… పలు అంశాలపై కూడా చర్చించారు. ఉద్యోగుల హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో అమల్లో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తామని కూడా చెప్పారు. దీన్ని 60 రోజుల్లోగా పూర్తి చేసేలా కెబినెట్ సబ్ కమిటీ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు.
ఉద్యోగుల వైద్య సేవల పథకం (EHS) ను 60 రోజుల్లోగా మెరుగుపరిచి, మెరుగైన సేవలు అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్యూన్, వాచ్‌మెన్, అటెండర్, ప్లంబర్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల పేర్లను గౌరవప్రదంగా మార్చాలని నిర్ణయించారు. త్వరలోనే వీటిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.