విశాఖ మెట్రో, ఇతర ప్రాజెక్టుల ఆమోదం కోసం ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు

ఏపీ ప్రాజెక్టుల వేగవంతానికి సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. విశాఖ మెట్రో, నదుల అనుసంధానంపై కేంద్రంతో చర్చలు జరగనున్నాయి.

Published on: Oct 7, 2026, 17:39:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి రెండు రోజుల పాటు దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదం, ఆర్థిక నిధుల సమీకరణ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడం, కరవు పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విశాఖపట్నం బీచ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం కోరనున్నారు.

ఎల్ నీనో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, రైతులకు సాయం అందించేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లేదా సహాయం అందించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను అర్థించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగే భేటీలో గోదావరి నది నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం, నదుల అనుసంధానం ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

వచ్చే ఏడాది కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు ఏర్పాట్లకు కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక, లాజిస్టిక్ మద్దతును అందించాల్సిందిగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరనున్నారు.

రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలో జాతీయ రహదారుల అనుసంధానం, నూతన రోడ్డు ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు.

పర్యటనలో భాగంగా గురువారం రోజున కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించే భాగస్వామ్య సదస్సు ముందస్తు కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం గురువారం అర్ధరాత్రికి సీఎం చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకుంటారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More