AP Private Schools Free Admissions : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విద్యా హక్కు చట్టం (RTE) 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు అమలవుతున్న ప్రస్తుత మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణల రూపకల్పన, పకడ్బందీ అమలు కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది జనవరి 13వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుతో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈ ఉచిత ప్రవేశాల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉచిత సీట్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా, అసలైన అర్హులైన నిరుపేద విద్యార్థులకే ఈ ప్రయోజనం అందేలా పాత నిబంధనలను సవరించి కొత్త మార్గదర్శకాలను రూపొందించనున్నారు.
16 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ
నూతన మార్గదర్శకాల సవరణ బాధ్యతలను వేగవంతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఛైర్‌పర్సన్‌గా మొత్తం 16 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీమ్ అన్సారియా ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
- ఈ రాష్ట్ర స్థాయి కమిటీ విద్యా హక్కు చట్టం అమలు తీరును, ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల విధానాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది.
- అర్హతల నిబంధనలు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, సీట్ల కేటాయింపు మరియు పాఠశాలల యాజమాన్యాలకు చెల్లించే ఫీజుల పునరుద్ధరణ వంటి అంశాలపై స్పష్టమైన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
- కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్త ఉచిత ప్రవేశాల గైడ్‌లైన్స్‌ను త్వరలోనే అమలు చేయనున్నారు.