ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో విధులు నిర్వహణ అందిస్తున్న జూనియర్ డాక్టర్లకు (జూడా) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు డిమాండ్‌పై సానుకూలంగా స్పందిస్తూ అధికారికంగా జీవో విడుదల చేసింది. పెరిగిన ఈ స్టైపెండ్ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్‌షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లకు 10 శాతం, పీజీ (PG) విద్యార్థులకు 5 శాతం, సూపర్ స్పెషాలిటీ కోర్సులు అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు 3.5 శాతం చొప్పున స్టైపెండ్ పెరిగింది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 34.08 కోట్ల అదనపు భారం పడనుంది.
గత నెలలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా స్టైపెండ్ పెంపు కోసం నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రారంభంలో వైద్యులు తమ స్టైపెండ్‌ను 30 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థిక పరిమితులను వివరిస్తూ వార్షిక పెంపు ప్రాతిపదికన సంవత్సరానికి 3 శాతం నుంచి 5 శాతం పెంపును ప్రతిపాదించగా, వైద్య సంఘాలు దానిని తిరస్కరించాయి.
సుమారు 9,000 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొనడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మాతాశిశు వైద్యశాలలు, ఐసీయూ, అత్యవసర విభాగాల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమ్మెలో ఉన్న వైద్య ప్రతినిధులతో పలు విడతల చర్చలు జరిపింది. వైద్యుల అభ్యర్థనలు, ఇతర రాష్ట్రాల్లోని వేతన విధానాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ నూతన పెంపును ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని స్టైపెండ్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆసుపత్రుల్లో సాధారణ సేవలతో పాటు అత్యవసర సేవలు మరింత పటిష్టంగా అందుబాటులోకి రానున్నాయి.
{{/usCountry}}ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని స్టైపెండ్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆసుపత్రుల్లో సాధారణ సేవలతో పాటు అత్యవసర సేవలు మరింత పటిష్టంగా అందుబాటులోకి రానున్నాయి.
{{/usCountry}}