...
...
Next Story

ఏపీలో గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ - యాక్షన్ ప్లాన్ పై కసరత్తు, ఉగాది నుంచి అమలు..!

ఏపీలో ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు కానుంది. ఆలోపే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. స్వజాతి మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Published on: Jan 21, 2026, 13:11:40 IST
Advertisement

రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. వచ్చే ఉగాది నుంచి ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలిచ్చారు. ఈ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు
ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు

ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు కావాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. పరిశ్రమల శాఖ… కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు, తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని నిర్దేశం చేశారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత వర్గాలకు సూచనలు చేశారు.

2047 నాటికి 50 శాతం గ్రీనరీ - డిప్యూటీ సీఎం

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపు ప్రాజెక్టుకి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రం మొత్తం భూ భాగంలో 2047 నాటికి 50 శాతం పచ్చదనంతో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంది. ఈ లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 37 శాతం పచ్చదనం నింపాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం గ్రీనరి ఉండగా.., వచ్చే నాలుగేళ్లలో మరో 7 శాతం గ్రీనరీ పెంచాల్సి ఉంది. అందుకోసం 9 లక్షల హెక్టార్లలో చెట్లను నాటాలి. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు భాగస్వామ్యం పోషించాల్సి ఉంది. అందులో ఉద్యానవన శాఖ 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాల్సి ఉంది" అని వివరించారు.

“970 ఎకరాల తీర ప్రాంతం వెంబడి 40 శాతం అటవీ శాఖ పరిధిలో ఉంది. మిగిలిన భూభాగంలో ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరం అయిన ప్రణాళికలు ఆయా శాఖలు సిద్ధం చేయాలి. తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతంలో అక్కడ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశ్రామిక కారిడార్లలో కాలుష్య నియంత్రణకు తోడ్పడే మొక్కలను పెంచాలి. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల రకాల మొక్కలు పెంచాలి. శాఖల వారీ యాక్షన్ ప్లాన్ అవసరం. నిర్దేశిత సమయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయండి” అని పవన్ దిశానిర్దెశం చేశారు.

“50 శాతం గ్రీనరీ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. బడ్జెట్ కేటాయింపులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తాం. లక్ష్యాలకు అనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసే బాధ్యతను యంత్రాంగం నిబద్దతతో ముందుకు తీసుకువెళ్లాలి. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలతో రావాలి” అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe