ఏపీ పురపోరు: ముగిసిన నామినేషన్ల ఘట్టం.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆదివారం చివరిరోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

Published on: Oct 18, 2026, 16:26:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో పూర్తయింది. చివరి రోజైన ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద వరుసలో ఉన్న అభ్యర్థులందరి పత్రాలను అధికారులు స్వీకరించారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలు

అంతిమ గడువు ముగియడంతో అన్ని ప్రధాన పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం అక్టోబర్ 19న అధికారులు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన చేపడతారు.

పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు.

అక్టోబర్ 30వ తేదీన ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలలో (13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు) మొత్తం 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ పూర్తవడంతో అభ్యర్థుల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్బన్ స్థానిక పోరు ముగిసిన వెంటనే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తదుపరి దశల పోలింగ్ ప్రక్రియ వరుసగా ప్రారంభం కానుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్

రెండో దశ కింద ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 19న వస్తుంది. నామినేషన్ల తుది గడువు 23, నామినేషన్ల ఉపసంహరణ 27 వరకు ఉంటుంది. పోలింగ్ తేదీ నవంబర్ 3 ఉండగా.. ఫలితాలు నవంబర్ 5న వెల్లడిస్తారు.

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన రోజు సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

తొలి విడత

నోటిఫికేషన్: నవంబరు 13

నామినేషన్ల గడువు: నవంబరు 17 (ఉపసంహరణ: నవంబరు 21)

పోలింగ్ & లెక్కింపు: నవంబరు 26

రెండో విడత

నోటిఫికేషన్: నవంబరు 18

నామినేషన్ల గడువు: నవంబరు 20 (ఉపసంహరణ: నవంబరు 24)

పోలింగ్ & లెక్కింపు: నవంబరు 29

మూడో విడత

నోటిఫికేషన్: నవంబరు 19

నామినేషన్ల గడువు: నవంబరు 23 (ఉపసంహరణ: నవంబరు 27)

పోలింగ్ & లెక్కింపు: డిసెంబరు 2

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More