AP PGECET 2026 Counselling : రాష్ట్రంలోని ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్ కౌన్సెలింగ్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. తాజా ఉన్నత విద్యామండలి… ఏపీ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

గేట్, జీప్యాట్ (GPAT), ఏపీ పీజీఈసెట్-2026 (AP PGECET-2026) పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులని కౌన్సెలింగ్ కన్వీనర్ వి. పద్మారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ముఖ్యమైన తేదీలు…
ప్రాథమిక నోటిఫికేషన్ లో ప్రకటించిన వివరాల ప్రకారం… ఏపీ పీజీఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 16వ తేదీ (16-09-2026) నుంచి ప్రారంభమై… 25వ తేదీ (25-09-2026) వరకు కొనసాగుతుంది. ఈ వ్యవధిలోనే అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల ఆన్‌లైన్ పరిశీలన (ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్), వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- కోర్సులు: ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా-డి (పి.బి)
- అర్హత: ఏపీ పీజీఈసెట్ / గేట్ / జీప్యాట్-2026 లో అర్హత సాధించిన అభ్యర్థులు
- కౌన్సెలింగ్ తేదీలు: 16-09-2026 నుంచి 25-09-2026 వరకు
- అధికారిక వెబ్‌సైట్: https://cap.apcfss.in
అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల నమోదు కోసం కమీషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అధికారిక పోర్టల్ https://cap.apcfss.in ను సందర్శించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, మార్గదర్శకాలు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
ఈ ఏడాది AP PGECET-2026కు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 12102గా ఉంది. పరీక్షకు 9990 మంది హాజరయ్యారు. 9320 అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల శాతం 93.29 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం 94.17 ఉత్తీర్ణత శాతంతో టాప్‌లో ఉంది. విజయనగరం 92.88 శాతంతో చివరలో ఉంది.
ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా :
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in సందర్శించండి.
- హోమ్ పేజీలో 'APPGECET-2026 Results లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
- వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఫలితాలు కనిపిస్తాయి.