విశ్లేషణ : ఏపీ వికాసానికి... రైల్వే సంస్కరణలే దారి!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైల్వే మౌలిక వసతులే లైఫ్‌లైన్. రూ.3.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు, కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌తో….. అమరావతి, కోస్తా, రాయలసీమలో సరికొత్త ఆర్థిక విప్లవం రానుంది.

Published on: Aug 31, 2026, 13:38:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒక ఊరికి రైలొస్తే అక్కడ కేవలం రైల్వే స్టేషన్ తో పాటు... దానివెంటే ఒక మార్కెట్ వస్తుంది. పరిశ్రమలు వస్తాయి. సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపిరిపోసుకుంటుంది. కోస్తా తీరం నుంచి రాయలసీమ సరిహద్దుల వరకు ఆంధ్రప్రదేశ్ భూగోళాన్ని గమనిస్తే... ఇక్కడ పడే ప్రతి రైలు పట్టా, ఇక్కడి రైతు శ్రమను దేశానికి అనుసంధానించే ఒక లైఫ్ లైన్ గా కనిపిస్తుంది. అందుకే ఏపీ భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరించడంలో రైల్వే మౌలిక వసతులే కీలక భూమిక పోషిస్తాయి.

విశ్లేషణ : ఏపీ వికాసానికి... రైల్వే సంస్కరణలే దారి!
విశ్లేషణ : ఏపీ వికాసానికి... రైల్వే సంస్కరణలే దారి!

2026 జూన్ 1న విశాఖపట్నం కేంద్రంగా 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్' అందుబాటులోకి రావడం దశాబ్దాల పోరాటానికి లభించిన విజయం. అయితే ఈ జోన్ సాధించుకోవడంతోనే మన బాధ్యత అయిపోలేదు, అసలైన సవాలు ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే, ఈ అవకాశాన్ని నిరంతర క్రియాశీలక కార్యాచరణగా మలచాల్సిన బాధ్యత ఉన్నది.

ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల ప‌రిధిలో దాదాపు రూ.58,530 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో రూ. 51,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో ఉండగా, సుమారు రూ. 20,740 కోట్ల పనులు సర్వే దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గుండా ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్ కారిడార్లలో దాదాపు రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ గణాంకాలన్నీ రాష్ట్రం ఒక అపూర్వమైన రైల్వే అభివృద్ధి శకంలోకి అడుగుపెడుతోందని స్పష్టం చేస్తున్నాయి.

అయితే కేవలం పెట్టుబడుల కేటాయింపు మాత్రమే సరిపోదు. క్షేత్రస్థాయిలో పనులను వేగవంతంగా పూర్తి చేయడమే ఇప్పటి తక్షణ ప్రాధాన్యత కావాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంతో ప్రాధాన్యత ఉన్న అనేక రైల్వే ప్రాజెక్టులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. మాచర్ల-నల్గొండ, కోటిపల్లి-నర్సాపురం, కడప-బెంగళూరు, నడికుడి-శ్రీకాళహస్తి, భద్రాచలం రోడ్-కోవ్వూరు, కంబం-ప్రొద్దుటూరు తదితర లైన్లను నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. పనుల్లో జాప్యం వల్ల కనెక్టివిటీ ఆలస్యం కావడమే కాకుండా, ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగి, ఆయా ప్రాంతాలకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చేకూరకుండా పోతున్నాయి.

ఇందుకు కోటిపల్లి-నర్సాపురం లైన్ ఒక స్పష్టమైన ఉదాహరణ. ప్రాజెక్టు ప్రారంభ దశలో దీని అంచనా వ్యయం దాదాపు రూ.498 కోట్లు కాగా, తీవ్రమైన జాప్యం కారణంగా ఆ వ్యయం ఇప్పుడు ఏకంగా రూ.1,200 కోట్లకు చేరింది. మౌలిక వసతుల కల్పనను వాయిదా వేయడం ఎంత భారమో ఈ ఉదాహరణ సూచిస్తోంది. రైల్వే ప్రాజెక్టుల ఆల‌స్యం వ‌ల‌న‌ ప్రతి ఏటా ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, ఆయా ప్రాంతాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని విస్తరించుకునే అవకాశాన్ని ఒక ఏడాది పాటు కోల్పోతాయి.

రైల్వే ప్రణాళికలు కేవలం పాత ప్రాజెక్టులకే పరిమితం కాకూడదు. మార్కాపురం-శ్రీశైలం-హైదరాబాద్, మాచర్ల-గద్వాల, నెల్లూరు-రాజంపేట, సామర్లకోట-చింతూరు, భద్రాచలం-సత్తుపల్లి వంటి ప్రతిపాదిత మార్గాలకు సర్వేలు పూర్తయ్యాయి. ఆర్థిక సాధ్యత, వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ప్రతిపాదనలను సర్వే బల్లల నుంచి త్వరితగతిన క్షేత్రస్థాయి అమల్లోకి తీసుకెళ్లాలి.

రైల్వే విస్తరణలోని ఆర్థిక కోణాన్ని కూడా మనం పరిశీలించాలి. సాధారణంగా ప్రతిపాదిత కొత్త రైల్వే లైన్లపై కనీసం 6 శాతం రాబడి వస్తుందని భావిస్తేనే రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం అవి ఆర్థికంగా సాధ్యమయ్యేవిగా పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపాదిత లైన్ల రాబడి 6 నుంచి 10 శాతం పరిధిలో ఉండే అవకాశం ఉందని అంచనా. కాబట్టి రైల్వే విస్తరణను కేవలం ఖర్చు కోణంలోనే చూడకూడదు. మెరుగైన కనెక్టివిటీ వల్ల సరుకు రవాణా, లాజిస్టిక్స్, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి రంగాలు బలోపేతమవుతాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఒక దీర్ఘదర్శి రైల్వే వ్యూహం అవసరం ఎంతో ఉన్నది. అమరావతిని విజయవాడ, గుంటూరులతో పాటు జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తూ ఒక సమగ్ర రైల్వే కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే, రాజధాని ప్రాంతం రాష్ట్ర సమగ్ర ఆర్థిక వ్యవస్థతో సజావుగా అనుసంధానమవుతుంది.

ప్రయాణికుల కనెక్టివిటీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు రాష్ట్ర ఆర్థిక, విద్య, పారిశ్రామిక, ఆధ్యాత్మిక రంగానికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఈ నగరాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణే, న్యూఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ కేంద్రాలకు అదనపు వందే భారత్ సేవలను, ప్రత్యక్ష రైళ్లను అందుబాటులోకి తేస్తే ప్రయాణ సమయం తగ్గడమే కాక వ్యాపార, పర్యాటక రంగాలకు ఊతం ఇచ్చినట్టువుంది. అలాగే విజయవాడ నుంచి న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకు నేరుగా రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాల్సి ఉంది.

మౌలిక వసతుల కల్పనతో పాటు సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడం కూడా అంతే ముఖ్యం. రాబోయే రోజుల్లో జరిగే భారీ పెట్టుబడుల దృష్ట్యా రైట్స్, ఆర్వీఎన్ఎల్, రేల్ టెల్, కాన్ కోర్, ఐఆర్సీటీసీ, డీఎఫ్సీసీఐల్, ఐఆర్ఎఫ్ సి వంటి సంస్థల ప్రాంతీయ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌లో నెల‌కొల్పితే ప్రాజెక్టుల పర్యవేక్షణ, సమన్వయం నిర్ణయాల ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది కేవలం ఒక పరిపాలనా మార్పుగా మాత్రమే కాక, పనుల అమలును పరుగులు తీయించే ఒక శక్తివంతమైన ఇంజిన్‌గా మారాలి.

స్టేషన్ల ఆధునీకరణ, రైల్వే భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా ఎదుగుతున్న పిఠాపురం రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ప్రధాన స్టేషన్ల ఆధునీకరణను కొనసాగిస్తూనే, రద్దీ ఎక్కువ ఉన్న మార్గాల్లో అదనపు లైన్లు, యార్డ్ రీమోడలింగ్, ఆటోమేటిక్ సిగ్నలింగ్, టెర్మినల్ సామర్థ్య పెంపు చర్యలు చేపట్టాలి. రైల్వే విస్తరణలో కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, ట్రాక్ రెన్యూవల్ వంటి భద్రతా ప్రమాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి.

అంతిమంగా…. ఆంధ్రప్రదేశ్‌కు మరింత రైల్వే మౌలిక సదుపాయాలు అవసరమా లేదా అనేది ప్రశ్నే కాదు. స్పష్టంగా అవసరమే. అయితే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను, పారిశ్రామిక కేంద్రాలను, ఓడరేవులను, ఆధ్యాత్మిక క్షేత్రాలను విస్తరిస్తున్న పట్టణ ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించేలా ఒక సమగ్ర రైల్వే నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఈ అవకాశాన్ని ఏవిధంగా ఉపయోగించుకుంటుందనేదే అసలు ప్రశ్న. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆ చారిత్రాత్మక అవకాశాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు అత్యంత అత్యవసరమైనది ప్రాజెక్టులను వేగంగా 'పూర్తి చేసి` మంజూరైన ప్రాజెక్టుల ప‌నులు ముందుకు సాగాలి, సర్వే పూర్తయిన లైన్లను త్వరగా సమీక్షించాలి, సాధ్యత ఉన్న ప్రతిపాదనలకు ప్రాధాన్యమివ్వాలి, కాగితాలపై ఉన్న పెట్టుబడులు క్షేత్రస్థాయి మౌలిక వసతులుగా మారాలి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వేసే రైలు పట్టాలే రాబోయే దశాబ్దాల్లో రాష్ట్ర ప్రగతి గమనాన్ని నిర్ణయిస్తాయి. ఎందుకంటే, బలమైన రైల్వే వ్యవస్థ ఒకవైపు ప్రజలను, సరుకులను రవాణా చేస్తూనే... మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ను మరింత అనుసంధానిత, పోటీతత్వమున్న, సమతుల్య ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపిస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను పోటీతత్వమున్న ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్ప‌టిఏ అనేక‌సార్లు కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే... ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కి జనసేన తరఫున సమగ్ర వినతిపత్రం సమర్పించ‌డంతోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని కోర‌డం జ‌రిగింది.

విశ్లేషణ : లింగమనేని రమేష్, పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ), జ‌న‌సేన‌.

లింగమనేని రమేష్, ఎంపీ(రాజ్యసభ)
లింగమనేని రమేష్, ఎంపీ(రాజ్యసభ)
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More