AP TET 2026 Registration : ఏపీ టెట్ కోసం చూస్తున్న వారికి ముఖ్యమైన అలర్ట్. ప్రస్తుతం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ గడువు ఇవాళ్టితో ముగుస్తుంది. కాబట్టి ఆయా అభ్యర్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆగస్టు 5 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు జూలై 25, 2026 నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT - ఆన్‌లైన్ పద్ధతి) రూపంలో వివిధ సెషన్లలో నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 15న ఫలితాలు
పరీక్షల నిర్వహణ ముగిసిన అనంతరం సమాధాన పత్రాల పరిశీలన, ప్రాథమిక కీ, అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియలను విద్యాశాఖ వేగంగా పూర్తి చేయనుంది. అన్ని పరిశీలనలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ తుది ఫలితాలను విడుదల చేస్తారు.
ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్నందున అభ్యర్థులు ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తక ముందే దరఖాస్తు ప్రక్రియను ముగించుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
ఏపీ టెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే 'రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ ప్రాథమిక గుర్తింపు వివరాల (ఆధార్ వివరాలు) ఆధారంగా ప్రాథమిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- అనంతరం మీ విద్యా అర్హతలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, నిర్దేశిత పరిమాణంలో ఉన్న ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు రుసుము చెల్లింపు పూర్తి చేసిన తర్వాత, వివరాలన్నీ సరిచూసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.