...
...
Next Story

Venkatagiri Poleramma Jatara : వెంకటగిరి పోలేరమ్మ జాతరకు 160 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. జాతర వెనక కథ ఇదే

Venkatagiri Poleramma Jatara : వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏపీఎస్ఆర్టీసీ 160 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈ జాతర వందల ఏళ్లుగా ఎంతో వైభవంగా జరుగుతుంది. జాతర విశిష్టతను తెలుసుకోండి.

Published on: Sep 28, 2026, 08:40:40 IST
Advertisement

తిరుపతి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ జాతర ఉత్సవాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక ప్రకటన చేసింది. ఉత్సవాల్లో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 30, అక్టోబరు 1వ తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి వెంకటగిరికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా సదుపాయాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు.

ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

జాతర ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రెండు రోజుల్లో మొత్తం 160 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ కేటాయించింది. సెప్టెంబరు 30న 54 ప్రత్యేక బస్సులు, అక్టోబరు 1న 106 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ ప్రత్యేక బస్సులను రాపూరు, గూడూరు, నెల్లూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట, తిరుపతి, రాజంపేట ప్రాంతాల నుంచి వెంకటగిరికి రాకపోకలు సాగించేలా ప్రణాళికలు రూపొందించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు కోరారు.

రాష్ట్రంలో విశేష ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ గ్రామదేవతల జాతరలలో వెంకటగిరి పోలేరమ్మ జాతర ఒకటి. వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా వినాయకచవితి తర్వాత ఈ జాతర ఉంటుంది.

వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతరకు ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగానూ ఎంతో విశిష్టత ఉంది. వెంకటగిరి సంస్థానాధీశుల కాలంలో ప్రారంభమైన ఈ జాతరతో రాచరిక వంశానికి ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. వెంకటగిరి రాజుల వంశానికి చెందిన దాదాపు 33 తరాల పాలకులు ఈ పోలేరమ్మ జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం విశేషం.

1992 నుంచి ఈ పోలేరమ్మ దేవాలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో, ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ ముగిసిన తర్వాత వచ్చే రోజుల్లో జాతర తేదీలను నిర్ణయిస్తారు.

వినాయక చవితి తర్వాతి మొదటి బుధవారం అర్ధరాత్రి వేళ గ్రామస్థులు మొదటి చాటింపు వేస్తారు. తర్వాతి వారం అంటే రెండో బుధవారం రోజున రెండో చాటింపు వేస్తారు. మూడో వారం వచ్చే బుధవారం, గురువారాల్లో ప్రధాన పోలేరమ్మ జాతర మహోత్సవం నిర్వహిస్తారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో కొన్ని ప్రత్యేకమైన కఠిన నిబంధనలు, సాంప్రదాయాలు పాటిస్తారు. జాతర జరిగే ఈ ఐదు రోజుల పాటు స్థానికులు తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు లేదా పెళ్లిళ్లు జరుపుకోరు.

జాతరకు ముందుగా గ్రామ పొలిమేరల్లో రెండు రాళ్లను శక్తి స్వరూపాలుగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. మొదట భక్తుల దర్శనం కోసం పుట్టమట్టితో రూపుదిద్దిన అమ్మవారి విగ్రహాన్ని కళ్లు లేకుండా ఉంచుతారు. అనంతరం విగ్రహానికి ముసుగు వేసి పల్లకిలో అమ్మవారి అత్తవారి ఇల్లుగా భావించే 'జీనిగవారి వీధి'కి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారికి కళ్లు, దిష్టి చుక్క ఉంచుతారు. ఈ క్రతువు చాలా ప్రత్యేకమైనది. అమ్మవారి కళ్లను నేరుగా చూడకుండా, అద్దంలో అమ్మవారి ప్రతిబింబం చూస్తూ వెనుక నుంచి నేత్రాలను అమరుస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks