Ganesh Immersion Holiday : వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25న సెలవు.. ట్రాఫిక్ ఆంక్షలు

Ganesh Immersion Holiday : వినాయక నిమజ్జనం పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో సెప్టెంబర్ 25న సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Sep 23, 2026, 19:34:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వినాయక విగ్రహాల నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరిగే నేపథ్యంలో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యార్థం సెప్టెంబరు 25, 2026 (శుక్రవారం) రోజున సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

గణేష్ నిమజ్జనం సెలవు
గణేష్ నిమజ్జనం సెలవు

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సెలవు ఉత్తర్వులు హైదరాబాద్ - సికింద్రాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాల్లో అమల్లో ఉంటాయి. ఈ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

సెప్టెంబరు 25న ప్రకటించిన సెలవుకు బదులుగా నవంబరు 14(రెండో శనివారం) రోజును పని దినంగా ప్రభుత్వం ఖరారు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఆఫీసులు, విద్యాసంస్థలన్నీ నవంబరు 14న సాధారణ రోజులాగే పనిచేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. హుస్సేన్‌సాగర్ (ట్యాంక్‌బండ్), సరూర్‌నగర్ చెరువు సహా నగరంలోని వివిధ చెరువుల వద్దకు భారీగా వాహనాలు చేరుకుంటాయి. దీనివల్ల నగరంలోని ప్రధాన మార్గాల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పాఠశాల వాహనాలు, ఉద్యోగుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, అలాగే నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 14 పనిదినంగా తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో విధి నిర్వహణలో నిమగ్నమయ్యాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిమజ్జన శోభాయాత్ర పర్యవేక్షణ కోసం ఈ ఏడాది అత్యాధునిక కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

గణేశ్ ఉత్సవాలకు సంబంధించి పాత వీడియోలు లేదా తప్పుడు (ఫేక్) వీడియోలను నెట్టింట పోస్ట్ చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. మండపాల వద్ద అశ్లీల పాటలు, వల్గర్ డ్యాన్సులపై ఫిర్యాదులు వచ్చాయని, ఇటువంటి చర్యలను సహించేది లేదన్నారు. నిమజ్జన ఊరేగింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఉపయోగిస్తే నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు.

విఘ్నేశ్వరుని నిమజ్జనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బృహత్తర భద్రతా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 20,000 మంది పోలీసులు, జిల్లాల నుంచి అదనంగా వచ్చిన 8,400 మంది బలగాలు విధుల్లో ఉంటారు. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ శోభాయాత్రల కోసం ప్రత్యేకంగా అదనపు బలగాలను కేటాయించారు.

ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి ఈరోజు అర్ధరాత్రి 12:00 గంటల వరకే భక్తులకు అనుమతి ఉంటుంది. డ్రోన్లు, సీసీ కెమెరాలు, హైరైజ్ కెమెరాలు, టెక్నాలజీ సాయంతో సమగ్ర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు కమిషనర్ వివరించారు. శోభాయాత్ర మార్గాలను, రద్దీని పరిశీలించేందుకు 24 ప్రత్యేక డ్రోన్లను వినియోగిస్తున్నారు. నగరవ్యాప్తంగా ఉన్న 10,000 సీసీ కెమెరాలను నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు.

ప్రజా సౌకర్యార్థం, నిమజ్జన మార్గాల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు రవాణా నిబంధనలు సవరించారు. సెప్టెంబర్ 25న ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నెల 25వ తేదీన ప్రైవేటు బస్సులు, ఇతర ప్రైవేటు ట్రక్కులు, భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.

చైన్ స్నాచింగ్స్, జేబు దొంగతనాలు, ఇతర దొంగతనాలను అరికట్టేందుకు 25 ప్రత్యేక క్రైమ్ విభాగాలు పనిచేస్తాయి. నిమజ్జన వేడుకలకు వచ్చే మహిళలు, యువతులపై ఎలాంటి వేధింపులు జరగకుండా నిరంతరం నిఘా ఉంచేందుకు 'షీ టీమ్స్' సాదాసీదా దుస్తుల్లో నగరమంతటా పహారా కాస్తాయని సీపీ సజ్జనార్ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More