విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ 100 ఎలక్ట్రిక్ బస్సులు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు స్పెషల్ సర్వీసులు!

విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ 100 ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. దశల వారీగా ఇవి రోడ్లపైకి ఎక్కనున్నాయి. అంతేకాదు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఇక్కడ నుంచి స్పెషల్ సర్వీసులను నడపనున్నారు అధికారులు.

Published on: Jun 14, 2026, 20:17:48 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పర్యాటక రంగంలో, పారిశ్రామికంగా ఎంతో వేగంగా దూసుకుపోతున్న విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా వ్యవస్థలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక వసతులు కల్పించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) విశాఖ జిల్లాలో 100 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది.

ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు

ఈ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా అందించే తొలి సర్వీసులను ముఖ్యంగా భోగాపురం అల్లురి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bhogapuram Airport) అనుసంధానం చేయనున్నారు. జూలై మొదటి వారంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆర్టీసీ ఈ ముందస్తు ప్లాన్ వేసింది.

విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణాళికను అధికారికంగా వెల్లడించారు. నగరంలోని వివిధ కీలక మార్గాల్లో ఈ బస్సులను నడపడానికి రూట్లను ఖరారు చేశారు. అయితే ఈ 100 బస్సులను ఒకేసారి కాకుండా మూడు దశల్లో రోడ్లపైకి తీసుకురానున్నారు.

మొదటి దశ జూన్ నెలలోనే తొలి విడతగా 20 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తారు. రెండో, మూడో దశ (జూలై, ఆగస్టు) మిగిలిన 80 ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా సర్వీసుల్లోకి ప్రవేశపెడతారు.

ఈ 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం విశాఖలోని రెండు ప్రధాన డిపోలను ఎంపిక చేశారు. గాజువాక డిపోకు 50 బస్సులు, సింహాచలం డిపోకు 50 బస్సులను సమానంగా కేటాయించారు. ఈ డిపోలలో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఈ గ్రీన్ ఎనర్జీ బస్సుల వల్ల విశాఖ నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులలో పుష్-బ్యాక్ సీట్లు, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో వాడేందుకు పానిక్ బటన్ వంటి భద్రతా వసతులు ఉంటాయి.

వైజాగ్ నగరం, మధురవాడ, విజయనగరం తదితర ప్రాంతాల నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే విమాన ప్రయాణికులకు ఈ బస్సులు ఒక వరంగా మారనున్నాయి. ప్రైవేట్ టాక్సీలతో పోలిస్తే చాలా తక్కువ ఛార్జీలతోనే ఎయిర్‌పోర్ట్ చేరుకోవచ్చు. ఈ సరికొత్త ఈ-బస్సుల రాకతో విశాఖ నగర రవాణా రంగం మరింత హైటెక్‌గా మారబోతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే భాగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచడంపై ఫోకస్ చేస్తారు అధికారులు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More