జులై 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె సమర్పణ.. కొత్త నిబంధన తెలుసా?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు జులై 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కొత్త నిబంధన తీసుకొచ్చారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నెల రోజుల పాటు జరిగే ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. 2026 జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కనకదుర్గ గుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) వి.కె. సీనా నాయక్ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీ కనకదుర్గ నగర్ వద్ద క్లోక్ రూమ్, ఉచిత పాదరక్షల స్టాండ్, మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ఆషాఢ సారె సమర్పణకు కొత్త నిబంధనలు
అమ్మవారికి సాంప్రదాయ ఆషాఢ సారెను సమర్పించే భక్తుల కోసం ఆలయ యంత్రాంగం ఈసారి ఒక క్రమబద్ధమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. సారె సమర్పించే భక్తులు మొదట కనకదుర్గ నగర్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకుని, రిజిస్ట్రేషన్ స్లిప్ పొందాలి.
ఆ తర్వాత కేటాయించిన క్యూ లైన్ ద్వారా మహామండపం ర్యాంప్ మీదుగా ఏడో అంతస్తుకు చేరుకోవాలి. అక్కడ రూ. 100 భవానీ అనుగ్రహ దర్శన క్యూ లైన్ ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత, భక్తులు ఆరో అంతస్తుకు చేరుకుని, తాము తెచ్చుకున్న సాంప్రదాయ సారెను (రిజిస్ట్రేషన్ స్లిప్ చూపించి) అమ్మవారికి సమర్పించవచ్చు. ఆలయం నుండి బయటకు వెళ్లే ముందు రెండో అంతస్తులో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది.
కట్టుదిట్టమైన భద్రత
ఉత్సవాల కాలంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, జనసందోహాల నిర్వహణపై ఈఓ సీనా నాయక్ నగర పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ల నుండి ఆశీర్వచన కౌంటర్ల వరకు ఎక్కడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ గార్డులను మోహరించడంపై చర్చించారు.
భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ఆలయ యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నాయని ఈఓ పేర్కొన్నారు. భక్తులందరూ భద్రతా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పూర్తి మద్దతు ఇస్తామని పోలీస్ అధికారులు సైతం హామీ ఇచ్చారు.
ఉత్సవాల ప్రారంభం ఇలా
ఆలయ స్థానాచార్య వి. శివప్రసాద్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 15 ఉదయం 7.30 గంటలకు మహామండపంలో అర్చకులు శ్రీ కనకదుర్గ అమ్మవారికి మొదటి అధికారిక ఆషాఢ సారెను సమర్పించడంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


