Andhrapradesh : పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం - ఇద్దరు కార్మికులు సజీవదహనం
Parawada Pharma City Fire Accident : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Parawada Pharma City Fire Accident : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ కంపెనీలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయిందని తెలుస్తోంది.

మృతి చెందిన ఇద్దరు కార్మికులను అచ్యుతాపురం వాసులుగా అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
సీఎం చంద్రబాబు ఆరా…
పరవాడ ఫార్మా సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘోర ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద తీవ్రతను, సహాయక చర్యలను సమీక్షించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్నిమాపక శకటం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. "ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది," అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
విచారణ జరిపించాలి - వైఎస్ జగన్
ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "విశాఖ ఫార్మా సిటీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరం," అని ఆయన పేర్కొన్నారు. పరవాడ దక్షిణ ఎనర్జీ సంస్థ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై జగన్ కీలక సూచనలు చేశారు. "ఈ ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలి" అని వైయస్ జగన్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని ఆయన కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

