ఆయేషా మీరా హత్య కేసు : ముగిసిన 18 ఏళ్ల న్యాయం పోరాటం - ఎప్పుడు ఏం జరిగింది..?
ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్ అయింది. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులు… సీబీఐ కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక (ఫైనల్ రిపోర్ట్)ను న్యాయస్థానం ఆమోదించింది. నివేదికను పరిశీలించిన అనంతరం కేసును క్లోజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆయేషా మీరా హత్య ఘటన….. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని హత్య కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. కానీ చివరికి దోషులు ఎవరో తేలకుండానే…. కేసు క్లోజ్ అయిపోయింది. దీంతో సుమారు 18 ఏళ్ల పాటు సాగిన ఆయేషా మీరా కుటుంబ సభ్యుల న్యాయ పోరాటం అంతం లేకుండానే ముగిసింది.
ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు…. కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక (ఫైనల్ రిపోర్ట్)ను సీబీఐ కోర్టు ఆమోదించింది. నివేదికను పరిశీలించిన అనంతరం కేసును క్లోజ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది.
ఇక ఈ కేసులో దర్యాప్తులో భాగంగా….. ఆయేషా మీరా మృతదేహానికి రెండవ సారి కూడా పోస్టుమార్టం నిర్వహించారు. కేసు క్లోజ్ చేసిన నేపథ్యంలో మరోవైపు తమ కుమార్తె శరీర అవశేషాలను అప్పగించాలని కోరుతూ ఆయేషా మీరా తల్లిదండ్రులు సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు… తల్లిదండ్రుల పిటిషన్ ను అనుమతించింది. ఫిబ్రవరి 27వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు బాధిత తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టులో గుర్తింపు పంచనామా జరిపిన అనంతరం….తెనాలిలోని స్మశాన వాటికలో వారి మతాచారం ప్రకారం ఆయేషా మీరా ఆఖరి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించాలని అధికారులను ఆదేశించింది. ఈ అంత్యక్రియల ప్రక్రియ మొత్తం సరైన పద్ధతిలో జరుగుతున్నట్లు రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది.
ఆయేషా మీరా హత్య కేసు - ఎప్పుడు ఏం జరిగింది..?
- 2007 డిసెంబర్ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఆయేషా మీరా అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.
- ఈ హత్య కేసులో తొలుత హాస్టల్‌లో వంట చేసే మనిషిని అనుమానించి విచారించారు. ఆ తరువాత లడ్డు అనే మరో వ్యక్తిని….. అతని స్నేహితుడు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిని విచారించారు.
- అప్పట్లో దివంగత మాజీమంత్రి కోనేరు రంగారావు మనవడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్ ఆనంద్ కేసును పర్యవేక్షించారు.
- ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కేసులో చేర్చడానికి యత్నించారు. కానీ చివరకు సత్యంబాబును నిందితుడిగా చేర్చారు.
- ఈ కేసులో సత్యం బాబుని నిందితుడిగా అరెస్ట్ చేశారు. అతనికి విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు 2009 సెప్టెంబరు 30న జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
- ఈ కేసులో తనని అన్యాయంగా ఇరికించారని సత్యంబాబు కూడా న్యాయపోరాటం చేశాడు. తనకు విధించిన శిక్షన హైకోర్టులో సవాల్ చేశాడు.
- అసలు దోషుల్ని కాపాడాలనే కోణంతోనే పోలీసులే సత్యంబాబును ఇరికించారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లు వెత్తాయి. సత్యంబాబు తల్లి కూడా దీక్షను కూడా చేపటింది.
- మరోవైపు సత్యంబాబు పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… 2017లో సత్యంబాబుని నిర్దోషి అని ప్రకటించింది. అతడిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని పేర్కొంటూ హైకోర్టు అతడిని విడుదల చేసింది.
- సత్యంబాబు నిర్దోషి అని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషా ద్ బేగం, ఇక్బాల్ బాషాలు పలుమార్లు కూడా చెప్పారు.
- ఈ కేసును మరోసారి విచారించి… అసలు నేరస్థులను పట్టుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ 11 నెలల పాటు దర్యాప్తు చేసింది.
- కిందిస్థాయిలో కోర్టులో ఈ కేసుకి సంబంధించిన కీలక సాక్ష్యాలు ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు రిపోర్ట్ చేసింది. ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు…. 2018 డిసెంబరు 16న సీబీఐకి కేసు అప్పగించింది. అప్పట్నుంచి ఈ కేసుపై విచారణ జరుపుతోంది.
- సీబీఐ దర్యాప్తు చేపట్టి ఐదేళ్లయినా ఎలాంటి ప్రగతీ లేదని ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించడంతో... సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం చేయించారు. దర్యాప్తు పూర్తయిందంటూ గతేడాది హైకోర్టుకు సీబీఐ నివేదిక కూడా ఇచ్చింది. కొత్త సాక్ష్యాలు, ఆధారాలు ఏమీ లేవని, కేసు రికార్డు ధ్వంసమైందని నివేదించింది.
- కేసుకు సంబంధించి కొత్త ఆధారాలేమీ లేకపోవడంతో విచారణను మూసివేస్తునట్లు సీబీఐ కోర్టు 2026 ఫిబ్రవరి 20వ తేదీన ప్రకటించింది. దర్యాప్తులో భాగంగా ఆయేషా సమాధి నుంచి సేకరించిన అవశేషాలను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

