నెయ్యి కల్తీ కేసులో వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నెయ్యి కల్తీ కేసుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. ప్రసాదాన్ని కల్తీ చేసి దేవుడికి పెట్టింది కాక నెయ్యి లేదు కాబట్టి కల్తీ లేదు అని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మత విశ్వాసం సున్నితమైన సమస్య అని… ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు.

చాలా అపచారాలు జరిగాయి - డిప్యూటీ సీఎం పవన్
“2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయి. మతం పరంగా మాట్లాడటానికి సున్నితమైన అంశాలు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండో నెలల్లో ఆరోపణలు, విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి అవసరం ఏముంటుంది ? ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడాం. రేపు ప్రజలు మాకు తెలిసినా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు అనే బయటకొచ్చి మాట్లాడాం. హైందవ సంస్కృతి మీద వైసీపీ తరచుగా దాడులు, అపవిత్రాలకు తెగబడుతుండడం వల్ల ఎదుర్కోవాల్సిన అవసరం, మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
"వ్యక్తుల మీద, ప్రత్యర్ధుల మీద పగలు ఉంటాయి కానీ వీళ్ళ పరంపరకి భగవంతుడి మీద పగ ఉండటం ఏంటో అర్థం కాదు. ప్రత్యేకించి ఏడుకొండలస్వామి మీద పగ. ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలు అంటారు.దీన్ని కల్తీ నెయ్యి అనడానికి కూడా లేదు ఎందుకంటే దీనిలో అసలు నెయ్యే లేదు.తప్పు జరిగిపోయింది అని క్షమాపణ అడక్కపోగా ఎదురు మాపై మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా.. భగవంతుడిపైన పగ పెట్టుకున్నాడు సర్వనాశనం అయిపోతాడు, బతికిన దాఖలాలు కూడా లేవు గుర్తు పెట్టుకోండి" అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
“ప్రసాదాన్ని కల్తీ చేసి దేవుడికి పెట్టింది కాక నెయ్యి లేదు కాబట్టి కల్తీ లేదు అని బుకాయిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగితే గుండెపోటు అని చెప్తారు, అమ్మవారి వెండి సింహాల చోరీ జరిగితే పోతే పోయాయి అంటారు. దేవుడి విగ్రహానికి అపవిత్రం జరిగితే ఎవడో పిచ్చోడు చేసాడు అంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళకి దేవుడు అంటే భయం, భక్తి లేవు” అని విమర్శించారు.
“వెనకడుగు వేసేది లేదు.. వైసీపీ హయాంలో చాలా పొరపాట్లు జరిగాయి. 2022 లోనే ఇలా కల్తీ జరుగుతుంది అని రిపోర్ట్ ఇస్తే దాన్ని బయటకి రానివ్వలే. అంటే మీకు తెలిసే చేశారు. ఇవన్నీ తెలిసే అయోధ్యకి కల్తీ లడ్డూలు పంపించారు. ఇది విశ్వాసాల మీద మీరు కొట్టిన దెబ్బ” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏక సభ్య కమిటీ - సీఎం ప్రకటన
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. “ నివేదికలన్నీ ఏకసభ్య కమిటీ ఎదుట ఉంచుతాం. తప్పు చేసిన ఎవరినీ వదిలేది లేదు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చింది. సీబీఐ నివేదికపై ఏకసభ్య కమిటీ విచారణ చేస్తుంది” అని ప్రకటించారు.

E-Paper












