తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన దోస్తీ..! ప్రచారంలోకి పవన్ కల్యాణ్
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన మధ్య మైత్రి కుదిరింది. ఇందులో భాగంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలోనూ బీజేపీ - జనసేన కలిసి పని చేయనున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కీలక ప్రకటన చేశాయి. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీ అభ్యర్థుల విజయం కోసం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదలైంది.

ఈనెల 7,8 తేదీల్లో పవన్ ప్రచారం…
“జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ… ఫిబ్రవరి 7, 8 తేదీలలో తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ త్వరలో ప్రకటిస్తాం” అని జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
జనసేన పార్టీ ప్రకటన కంటే ముందే పవన్ కల్యాణ్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీకి పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ తెలంగాణ నాయకత్వం కూడా ధ్రువీకరిస్తూ ట్వీట్ చేసింది.
ఇటీవలే కొండగట్టు పర్యటనకు వచ్చిన సమయంలోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈసారి తప్పకుండా పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణలోని నాయకత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ తరపున పలుచోట్ల నామినేషన్లను కూడా దాఖలయ్యాయి.
ఇప్పటికే ఏపీలో జనసేన - బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ ఇరు పార్టీల మధ్య మైత్రికి అడుగుపడినట్లు అయింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ఆకర్షించి… మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ మిశ్రా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇవాళ మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, పరిసర ప్రాంతాల కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

