కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశ..! బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం పడుతుందా?

కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశ కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిష్టాత్మక ప్రధాన ప్రాజెక్టులు కేటాయింపులు పొందడంలో విఫలమయ్యాయి. ఈ విషయాన్ని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రచారంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Published on: Feb 1, 2026, 22:36:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రీజనల్ రింగ్ రోడ్ , హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ II, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌తోపాటుగా మరిన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల కోసం తెలంగాణ ఎదురుచూసింది. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఇవి ఏవీ ప్రస్తావించలేదు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సామాజిక రంగాలలోని ఈ ప్రాజెక్టుల కోసం తెలంగాణ రూ. 1.5 లక్షల కోట్లకు పైగా కోరింది. కానీ ఎలాంటి కేటాయింపులూ జరగలేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం, అమరావతికి సంబంధింతి కొన్ని కేటాయింపులు జరిగాయి. దీంతో సహజంగానే పోలిక మెుదలైంది.

తెలంగాణ సచివాలయం
తెలంగాణ సచివాలయం

తెలంగాణకు అన్యాయం : భట్టి

బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్ 2026-27 భారతదేశం అంతటా ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించింది. వాటిలో మూడు హైదరాబాద్‌ను నేరుగా కలుపుతాయి. హైదరాబాద్‌ను ప్రత్యేక హై స్పీడ్ రైలు మార్గాల ద్వారా బెంగళూరు, చెన్నై, పూణేలకు అనుసంధానిస్తారు. ఈ కారిడార్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని, ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు. ఆర్థిక, రవాణా కేంద్రంగా హైదరాబాద్ పాత్రను బలోపేతం చేస్తాయని అంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం

తెలంగాణకు కేటాయింపుల విషయంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో దీనిని ఒక ప్రచార అంశంగా మార్చుకునే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణను పక్కన పెట్టడం లేదని ఓటర్లను ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. ఈ ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం పడుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ పదే పదే చేసిన అభ్యర్థనలను కేంద్రం విస్మరించిందని కాంగ్రెస్ అంటోంది.

తెలంగాణకు 3 హైస్పీడ్ రైళ్లు

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి బడ్జెట్‌ మీద మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ రూపకల్పన చేశారని చెప్పారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ II, మూసీ నది పునరుజ్జీవనంపై మాట్లాడారు. రాష్ట్రానికి మూడు హైస్పీడ్ రైళ్లు రానున్నాయన్నారు. మెట్రో గురించి ప్రత్యేకంగా బడ్జెట్‌లో ఉండదన్నారు. పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుందన్నారు. విస్తృత జాతీయ రోడ్‌మ్యాప్ కింద తెలంగాణ లాభాలను కేంద్రం చూస్తుందని నొక్కి చెప్పారు. బాలికల హాస్టళ్లు, డేటా సెంటర్లు, విదేశీ విద్య పన్ను తగ్గించడంలాంటి అంశాలు తెలంగాణకు మేలు చేస్తాయన్నారు.

ఇలా ప్రయోజనాలు!

ప్రధాన ప్రాజెక్టులు తప్పిపోయినప్పటికీ జాతీయ కేటాయింపుల నుండి తెలంగాణ పరోక్షంగా ప్రయోజనం పొందవచ్చని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. ఫార్మా, బయోటెక్ హబ్‌గా పిలువబడే హైదరాబాద్ రూ. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకం నుండి లాభం పొందవచ్చు అంటున్నారు. అయితే వీటి నుంచి రాష్ట్రం ఎంతవరకు ప్రయోజనం పొందగలదో స్పష్టత రావాలి. అదేవిధంగా, రూ. 10,000 కోట్ల MSME గ్రోత్ ఫండ్ హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న హబ్‌లకు మద్దతు ఇవ్వగలదలని అంటున్నారు బీజేపీ నేతలు.

ఐదు ప్రాంతీయ మెడికల్ టూరిజం కేంద్రాల ప్రకటనకు హైదరాబాద్ నుండి బలమైన సానుకూల స్పందనలు వచ్చాయి. ఇవి మెడికల్ టూరిజం రంగంలో నగరానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పంటలను వైవిధ్యపరచడం, మత్స్య సంపద, పశువుల సంపదను బలోపేతం చేయడం, సాంకేతికతను అమలు చేయడం లక్ష్యంగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు బడ్జెట్‌లో రూ.1.63 లక్షల కోట్ల కేటాయింపు కూడా తెలంగాణ రైతులకు అవకాశాలను తీసుకురావచ్చు.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూడా చాలాచోట్లు బలమైన ప్రభావం చూపిస్తుంది. ఆ ఓట్లను హస్తంపార్టీ తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, బీజేపీపై విమర్శలు చేయనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More