తిరుమల కల్తీ నెయ్యి కేసు : సిట్ పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి - టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉన్నట్లు సిట్ ఛార్జ్‌షీట్‌లో స్పష్టమైందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. నెయ్యి టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్నారు. నెయ్యి నాణ్యతపై తుది నిజాలు వెలుగులోకి రావాలంటే మైక్రో డీఎన్ఏ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

నిబంధనల ఉల్లంఘించారు - టీటీడీ ఛైర్మన్
తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం వాస్తవం కాదన్నారు. సిట్ ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ స్పష్టంగా నమోదు అయిందని ఆయన పేర్కొన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘన జరిగాయని…. కొందరికి లాభం చేకూర్చే విధంగా నిబంధనలను మార్చారని తెలిపారు.
సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించారని టీటీడీ ఛైర్మన్ చెప్పారు. సుమారు రూ. 250 కోట్ల రూపాయలతో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు జరిగిందన్నారు. ఈ నెయ్యిని పరీక్షించిన NDDB జంతు కొవ్వు ఉందని నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.
ఒక్క ఆవు కూడా లేకుండా, చుక్క నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి తయారు చేశామని చెప్పడం అబద్ధమన్నారు. నెయ్యి తయారీలో వాడిన కొన్ని రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని పేర్కొన్నారు. కమీషన్ల కోసమే కొన్ని డైరీలను ఎంపిక చేశారని అన్నారు.
క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. నెయ్యి నాణ్యతపై తుది నిజాలు వెలుగులోకి రావాలంటే మైక్రో డీఎన్ఏ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది ఖాతాల్లోకి వెళ్లిన కోట్ల రూపాయల లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని సిట్‌ను కోరారు.
బ్యాంక్ ఖాతాలలో కోట్ల రూపాయలు జమ కావడం వాస్తవమా కాదా అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రశ్నించారు. బినామీల వెనుక అసలు పెద్దలు ఎవరో నిగ్గుతేల్చాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని… టిటిడి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

