రాప్తాడు ఘటన: బాధిత విద్యార్థినికి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి
అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో దాడికి గురైన పదో తరగతి విద్యార్థినికి సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైద్య సాయంపై ఎమ్మెల్యే పరిటాల సునీత, అధికారులతో సమీక్షించారు.
అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురైన విద్యార్థినితో పాటు ఆమె తల్లితో సీఎం ఫోన్లో స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నిందితుడిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

ధైర్యంగా ఉండాలి
పాఠశాల గదిలోనే విద్యార్థినిపై జరిగిన అమానుష దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఫోన్ సంభాషణ సమయంలో విద్యార్థిని, ఆమె తల్లికి ధైర్యం చెప్పిన సీఎం, "ఎలాంటి భయాందోళన చెందవద్దు.. ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుంది" అని అభయమిచ్చారు. నిందితుడిని పట్టుకుని, చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ దాడి ఘటనలో గాయపడిన మరొక విద్యార్థికి కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
ఎమ్మెల్యే పరిటాల సునీతతో సమీక్ష
బాధిత విద్యార్థినికి అందుతున్న వైద్య సహాయంపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యార్థినికి అవసరమైన అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని సూచించారు.
కాగా, పాఠశాల తరగతి గదిలోనే పాఠాలు వింటున్న విద్యార్థినిపై ఒక వ్యక్తి రంపంతో (saw) అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అనంతపురం డిప్యూటీ సూపరింటేండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) అశ్విన్ మణదీప్ కాకుమాను స్పందిస్తూ, "రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే దారుణ దాడి జరిగినట్లు సమాచారం వచ్చింది. ఒక వ్యక్తి రంపంతో విద్యార్థినిపై దాడికి తెగబడ్డాడు" అని ధ్రువీకరించారు.
సమాజంలో చోట లేదు - ఎక్స్ వేదికగా ఆగ్రహం
పాఠశాలల లోపల ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ముష్కరులకు సమాజంలో చోటు లేదని సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.
"రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదిలోనే పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి నన్ను తీవ్రంగా కలిచివేసింది. తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. బడుల్లో మన ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకునే దాడికోరులకు మన సమాజంలో ఏమాత్రం చోటు లేదు" అని సీఎం ఎక్స్ లో పేర్కొన్నారు. నిందితుడిని వేగంగా వేటాడి పట్టుకోవాలని, చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


